మళ్లీ పడకేసిన పారిశ్రామికం

Sat,January 12, 2019 12:14 AM

Indias industrial growth falls to 17 month low of 0.5 Percentage in November

- నవంబర్‌లో 0.5 శాతానికి పరిమితం
- గడిచిన 17 నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి

న్యూఢిల్లీ, జనవరి 11: పారిశ్రామిక ప్రగతి మళ్లీ పడకేసింది. కొన్ని నెలలుగా ఎగువముఖం పట్టిన దేశపారిశ్రామిక ఉత్పత్తి నవంబర్ నెలలో భారీగా పతనం చెంది 0.5 శాతానికి పరిమితమైంది. గడిచిన 17 నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి. తయారీ రంగంలో నెలకొన్న నిరాశాజనక పనితీరు, కన్జ్యూమర్, క్యాపిటల్ గూడ్స్ విభాగాలు కూడా మందకొడి వృద్ధి ఇందుకు కారణమయ్యాయని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో పరిశ్రమల వృద్ధి 8.5 శాతంగా ఉన్నది. జూన్ 2017లో ఐఐపీ వృద్ధి 0.3 శాతంగా ఉన్నది. అక్టోబర్ నెలకుగాను విడుదలైన ఐఐపీ గణాంకాలను 8.1 శాతానికి బదులు 8.4 శాతానికి సవరించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో(ఏప్రిల్-నవంబర్) పరిశ్రమల్లో వృద్ధి 5 శాతానికి పెరిగింది. అంతక్రితం ఏడాది ఇది 3.2 శాతంగా ఉన్నది. పారిశ్రామిక ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్న తయారీ రంగంలో నెలకొన్న మందకొడి పరిస్థితులు మొత్తం గణాంకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏడాది క్రితం 10.4 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న తయారీ విభాగం ఈ సారి 0.4 శాతానికి పరిమితమైంది.

వీటితోపాటు గనులు కూడా 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందాయి. 2017 నవంబర్‌లో నమోదైన 1.4 శాతం పోలిస్తే మాత్రం రెండింతలు పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకోలేకపోయింది. ఇంధన రంగం 5.1 శాతం వృద్ధిని కనబరుచగా, క్యాపిటల్ గూడ్స్ 3.4 శాతానికి పరిమితమవగా, కన్జ్యూమర్ గూడ్స్ 3.1 శాతం నుంచి 0.9 శాతానికి పడిపోయింది. కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్ భారీగా పతనమయ్యాయి. ఏడాది క్రితం 23.7 శాతంగా ఉండగా, ఈసారికి మాత్రం 0.6 శాతంతో సరిపెట్టుకున్నది. 23 రంగాల్లో 10 మాత్రమే ఆశావాదంగా ఉండగా, మిగతా 13 ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కీలక వస్తువులు ప్రతికూల నుంచి 3.2 శాతానికి పెరుగడం విశేషం.

642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles