తొమ్మిది నెలల గరిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి


Fri,October 13, 2017 01:09 AM

ఆగస్టు నెలకు 4.3 శాతానికి ఎగిసిన సూచీ
IIP
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: గత కొద్దినెలలుగా నత్తనడకన సాగుతున్న పారిశ్రామిక రంగం మళ్లీ పుంజుకుంది. ఆగస్టులో దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.3 శాతానికి పుంజుకుంది. గత ఏడాది నవంబర్‌లో ఐఐపీ 5.7 శాతంగా నమోదైంది. ఆ తర్వాత మళ్లీ (తొమ్మిది నెలల్లో) ఇదే గరిష్ఠ వృద్ధి. మైనింగ్, విద్యుత్ రంగాలు పుంజుకోవడంతోపాటు భారీ యంత్రాల రంగంలోనూ ఉత్పత్తి పెరుగడం ఇందుకు దోహదపడిందని కేంద్ర గణాంక శాఖ (సీఎస్‌వో) గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో ఐఐపీ 4 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల కాలానికి (ఏప్రిల్-ఆగస్టు) ఐఐపీ 2.2 శాతానికి పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలానికి నమోదైన 5.9 శాతం వృద్ధితో పోలిస్తే మాత్రం భారీగా తగ్గింది. ఇకపోతే, ఈ ఏడాది జూలై నెల పారిశ్రామికోత్పత్తి వృద్ధిని గతనెలలో ప్రకటించిన 1.2 శాతం నుంచి 0.94 శాతానికి సవరించారు. పారిశ్రామికోత్పత్తి సూచీలో 77.63 శాతం వాటా ఉన్న వస్తు తయారీ రంగ వృద్ధి ఆగస్టులో 3.1 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే నెలకు 5.5 శాతంగా ఉంది. ఆగస్టులో మైనింగ్, విద్యుత్ రంగాలు వరుసగా 9.4 శాతం, 8.3 శాతం వృద్ధి సాధించాయి.

సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 3.28%

బహిరంగ మార్కెట్లోని ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గతనెలలో 3.28 శాతంగా నమోదైంది. ఆగస్టుతో పోలిస్తే సూచీలో ఎలాంటి మార్పులేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.39 శాతంగా నమోదైంది. ఆగస్టు నెలకు సూచీని గతంలో ప్రకటించిన 3.36 శాతం నుంచి 3.28 శాతానికి సవరించినట్లు గురువారం కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. గతనెలలో ఆహార ధరల ద్రవ్యోల్బణం 1.25 శాతంగా నమోదైంది. అంతక్రితం నెలలో 1.67 శాతంగా ఉంది. ఆగస్టులో 9.97 శాతంగా నమోదైన కూరగాయల ధరల వార్షిక పెరుగుదల.. సెప్టెంబర్‌లో 3.92 శాతానికి తగ్గింది. ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం పెరుగుదల 3.36 శాతం నుంచి 5.56 శాతానికి ఎగబాకింది. పప్పుల ధరల పెరుగుదల -22.51 శాతంగా నమోదైంది.

135

More News

VIRAL NEWS