22 బిలియన్ డాలర్లకు ఫార్మా ఎగుమతులు

Sat,September 14, 2019 03:18 AM

Indian pharma exports may touch $22 billion in FY20 Pharmexcil

-ఈ ఏడాది చేరుకునే అవకాశం ఉందన్న ఫార్మెగ్జిల్
హైదరాబాద్, సెప్టెంబర్ 13: దేశీయ ఫార్మా ఎగుమతులు మళ్లీ గాడిలో పడ్డాయి. గత రెండేండ్లుగా అమెరికాలో ధరల కరెక్షన్ కారణంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోనున్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మెగ్జిల్) వర్గాలు వెల్లడించాయి. వచ్చే మార్చినాటికి భారత్ నుంచి 22 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఇతర దేశాలకు ఎగుమతికానున్నాయని ఫార్మెగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 19.14 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక పరిస్థితులు కుదుటపడటం, చైనా ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీ నిర్ణయాలు దేశీయ ఫార్మా ఎగుమతులకు ఊతమిస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది జూలై నెలలోనే ఏకంగా ఎగుమతులు 21.7 శాతం పెరిగి 1.72 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో 13 శాతం పెరిగి 6.17 బిలియన్ డాలర్లుగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా జనరిక్ ఫార్మాస్యూటికల్స్‌కు విదేశాల్లో డిమాండ్ నెలకొన్నదని, దేశీయ ఎగుమతుల్లో 66 శాతం వాటా కలిగిన ఉత్తర అమెరికా, ఆఫ్రికా, యూరోపియన్ దేశాలు ఆశాజనకంగా ఉండటం ఫార్మా సంస్థలకు కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.

మాంద్యం ప్రభావం లేదు..

ఇతర రంగాలపై మాంద్యం ప్రభావం భారీగా ఉన్నప్పటికీ ఫార్మాపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని దేశాలు తీసుకున్న చర్యల వల్ల గత రెండేండ్లుగా అంతంత మాత్రంగానే వృద్ధిని నమోదు చేసుకున్నదని, చైనా, యూరప్ దేశాల నుంచి వచ్చిన డిమాండ్‌తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు చెప్పారు. ఇతర రంగాలకు ఎలాంటి ప్రత్యేక క్లస్టర్‌ను ఏర్పాటు చేశారో.. ఫార్మా రంగానికి కూడా అలాగే ప్రత్యేక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని, అప్పుడే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి సరుకు తగ్గే ఆస్కారం ఉందన్నారు. ప్రస్తుతం చైనా నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రిడియెంట్లు దిగుమతి చేసుకుంటుండగా, కేవలం 230 మిలియన్ డాలర్ల ఔషధాలను ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.

19 నుంచి ఇంటర్నేషనల్ రెగ్యులేటర్ మీట్

ఈ నెల 19 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ రెగ్యులేటర్ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు ఉదయ్ భాస్కర్ తెలిపారు. వాణిజ్య మంత్రిత్వశాఖ సహాయంతో ఫార్మెగ్జిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు ఫుడ్ అండ్ డ్రగ్గ్ రెగ్యులేటరీ అధికారులు అందరు హాజరవనున్నారు. చౌక ధరకు నాణ్యమైన ఔషధాలు అందించాలనే ఉద్దేశంలో జరుగుతున్న ఈ సమావేశాలకు 25 దేశాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరవనున్నారు.

269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles