రెండేండ్లలో రూ.2.35 లక్షల కోట్లకు

Wed,March 13, 2019 02:00 AM

-మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం
-ఫిక్కీ-ఈవై నివేదికలో వెల్లడి

ముంబై, మార్చి 12: దేశీయ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. 2021 నాటికి ఈ రంగం రూ.2.35 లక్షల కోట్లకు (33.6 బిలియన్ డాలర్లు) చేరుకోనున్నదని ఓ సర్వే వెల్లడించింది. ప్రతియేటా సగటున 11.6 శాతం వృద్ధి చెందనున్నదని ఫిక్కీ-ఈవై సంయు క్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గడిచిన సంవత్సరంలో రూ.1.67 లక్షల కోట్లు(23.9 బిలియన్ డాలర్లు)గా ఉన్నది. అంతక్రితం ఏడాది నమోదైన దాంతో పోలిస్తే 13.4 శాతం వృద్ధిని సాధించింది. ఈ రంగంలో అతిపెద్దదిగా కొనసాగుతున్న టీవీ కూడా డిజిటల్ బాట పట్టడంతో ప్రస్తుత సంవత్సరంలో ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాన్ని దాటివేసే అవకాశం ఉన్నదని వార్షిక ఇండస్ట్రీ సమ్మిట్ సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది.

దీంట్లో పలు ముఖ్యాంశాలు..


-భారత్‌లో 57 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉండగా, వీరిలో 25 లక్షల మంది డిజిటల్ మీడియా, సంప్రదాయక మీడియాను తిలకిస్తున్నారు.
-2021 నాటికి డిజిటల్ మీడియా విక్షకుల సంఖ్య రెండు రెట్లు పెరిగి 50 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నది.
-డిజిటల్ వినిమయం అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. వినియోగదారులు కోరుకుంటున్న విధంగా పరికరాలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదం చేస్తున్నాయి.
-2018లో రూ.66 వేల కోట్లుగా ఉన్న టీవీ పరిశ్రమ 12 శాతం వృద్దితో రూ.95,500 వేల కోట్లకు చేరుకోనున్నది. ప్రకటనల మార్కెట్ 14 శాతం వృద్ధితో రూ.30,500 కోట్లను తాకనున్నది. టీవీలు చూసేవారి సంఖ్య 19.7 కోట్లకు చేరుకోనున్నారు.
-రెండో అతిపెద్దదైన ప్రింట్ మీడియా విభాగం స్వల్ప వృద్ధికి పరిమితమైంది. 2018లో రూ.30,550 కోట్లుగా నమోదైంది. ప్రకటనల ద్వారా రూ.21,700 కోట్ల ఆదాయం సమకూరగా, సబ్‌స్క్రిప్షన్ ద్వారా రూ.8,830 కోట్లు లభించింది.
-పత్రికల్లో వచ్చే ప్రకటనలో ఒక శాతం తగ్గగా, అలాగే మ్యాగజైన్‌లో వచ్చే ప్రకటనల్లో 10 శాతం తగ్గుముఖం పట్టాయి.
-పత్రికల అమ్మకాలు పడిపోవడం, మరోవైపు టారిఫ్ రేట్లు అధికంగా ఉండటం వల్లనే ప్రకటనలు తగ్గడానికి ప్రధాన కారణం.
-మొత్తం వచ్చిన ప్రకటనల్లో హిందీ పత్రికల వాటా 37 శాతంగా ఉండగా, ఆ తర్వాతి ఇంగ్లీష్ పత్రికల వాటా 25 శాతంగా ఉన్నది.
-డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనమవడంతో న్యూస్‌ప్రింట్ కోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడంతో ఆయా సంస్థల లాభాలపై ప్రభావం చూపుతున్నది.
-జాతీయ ప్రకటనలతో పోలిస్తే ప్రాంతీయంగా వచ్చే ప్రకటనలు ఎక్కువగా ఉంటున్నాయి. బ్రాండ్‌ను మరింత ప్రమోట్ చేయడానికి జాతీయ సంస్థలు ఇందుకోసం అధికంగా నిధులు వెచ్చిస్తున్నాయి.
-ట్రాయ్ టారిఫ్ ధరలను పెంచడంతో టీవీలు చూసేవారి సంఖ్య భారీగా పడిపోయింది. అయినప్పటికీ త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు, క్రికెట్ వరల్డ్ కప్‌తో టీవీలు చూసేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
-డిజిటల్ న్యూస్‌ను వీక్షించేవారి సంఖ్య 22 కోట్లు దాటింది. వీరిలో పేజీలను తిలకించేవారి సంఖ్య 59 శాతంగా ఉన్నది.
-డిజిటల్ మీడియా విభాగం 42 శాతం వృద్ధితో రూ.16,900 కోట్లకు ఎగబాకింది. వీటిలో ప్రకటనలో రూపంలో రూ.15,400 కోట్లు , సబ్‌స్క్రిప్షన్ ద్వారా రూ.1,400 కోట్లు సమకూరాయి.
-వీడియో సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఆదాయం మూడింతలు పెరిగి రూ.1,340 కోట్లకు చేరుకున్నది. స్మార్ట్‌ఫోన్ల వాడకం భారీగా పెరుగడం, ఉచితంగా డాటా లభిస్తుండటం ఇందుకు దోహదం చేశాయి.
-సినిమా రంగం 12.2 శాతం సగటు వృద్ధితో రూ.17,450 కోట్లు దాటింది. దీంట్లో దేశీయ సినిమాల ద్వారా రూ.10 వేల కోట్లు లభిస్తున్నది.

1110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles