ఎగుమతుల్లో జోష్


Wed,May 16, 2018 12:15 AM

export
ఏప్రిల్‌లో 5.17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, మే 15: దేశీయ ఎగుమతులు జోష్ అందుకున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్‌లకు విదేశాల్లో డిమాండ్ నెలకొనడంతో గత నెలకుగాను ఎగుమతుల్లో 5.17 శాతం పెరిగి 2590 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే సమయంలో 3,960 కోట్ల డాలర్ల విలువైన వస్తువులను భారత్ దిగుమతి చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన దిగుమతులతో పోలిస్తే 4.6 శాతం చొప్పున పెరిగాయి. దీంతో వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 1370 కోట్ల డాలర్లుగా నమోదైంది. మార్చిలో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న ఎగుమతులు ఆ మరుసటి నెలలోనే పుంజుకోవడం విశేషం. ముఖ్యంగా గత నెలలో ఇంజినీరింగ్ గూడ్స్ (17.63 శాతం), కెమికల్స్ (38.48 శాతం), ఫార్మాస్యూటికల్స్ (13.56 శాతం), నూలు-చేనేత ఉత్పత్తులు(15.66 శాతం), ప్లాస్టిక్-లినోలియం (30.03 శాతం) విభాగాలు వృద్ధిని నమోదు చేసుకున్నాయి.

396
Tags

More News

VIRAL NEWS