ఎగుమతులకు ఊతమివ్వాలి


Mon,April 16, 2018 12:49 AM

-8 శాతం వృద్ధిరేటు సాధనపై ఏడీబీ ఆర్థికవేత్త సేన్ గుప్తా
ADB
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు, అంతర్జాతీయంగా ఎదురవుతున్న పోటీని తట్టుకునే విధంగా ఎగుమతులను మార్చగలిగితే స్థిరమైన రీతిలో భారత్ 8 శాతం వృద్ధిరేటును సాధించగలుగుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆర్థికవేత్త అభిజిత్ సేన్ గుప్తా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను క్రమబద్ధీకరించడంతో పాటు సరఫరాల వ్యవస్థను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఈ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టేందుకు అవకాశం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రస్తుతం పెట్టుబడులు, ఎగుమతులకు సంబంధించిన చోదకాలు వేగంగా ముందుకు లేదు. ఈ రెండింటినీ పరుగులు పెట్టించగలిగితే స్థిరమైన రీతిలో భారత్ 8 శాతం వృద్ధిరేటును సాధించగలుగుతుంది అని అభిజిత్ సేన్ గుప్తా పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో భారత ఆర్థిక వృద్ధిరేటు 7.3 శాతానికి పుంజుకుంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత వేగాన్ని పుంజుకుని 7.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇటీవల తన విశ్లేషణలో పేర్కొన్న విషయం విదితమే. అయితే దేశ ఎగుమతుల గురించి సేన్ గుప్తా ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ వాణిజ్యంలో ఇప్పటికీ భారత్ వాటా చాలా తక్కువగా ఉన్నదని, దేశ ఎగుమతులను పెంచుకునేందుకు ఇంకా ఎంతో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. చైనాలో కార్మికుల వేతనాలు పెరగడంతో ఆ దేశ ఎగుమతులు నానాటికీ ప్రియంగా మారుతున్నాయని, ఈ పరిస్థితిని భారత అనువుగా మలుచుకుని ప్రయోజనాలను పొందాలంటే పోటీతత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.

236

More News

VIRAL NEWS