హైదరాబాద్‌పైనే ఐటీ గురి!

Wed,January 23, 2019 12:00 AM

Increased leasing activities in SEZ

-ఆఫీస్ స్పేస్ కోసం విదేశీ సంస్థల అమితాసక్తి
-ఎస్‌ఈజెడ్‌లలో పెరిగిన లీజింగ్ కార్యకలాపాలు
-దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలాలకే డిమాండ్
-సీబీఆర్‌ఈ తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌పై విదేశీ ఐటీ సంస్థలు అమితాసక్తిని కనబరుస్తున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున స్థలాలను లీజుకు తీసుకుంటున్నాయని సీబీఆర్‌ఈ తాజా నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ 2018 చివరి త్రైమాసికానికి గాను ఇండియా ఆఫీస్ మార్కెట్ వ్యూ నివేదికను మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం పలు పేరెన్నిక గల అంతర్జాతీయ ఐటీ కంపెనీలు భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. వీటిలో ఎక్కువ కంపెనీలు దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల స్థలాలు తీసుకోవడం గమనార్హం. కోకాపేట్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో రెండు మధ్యతరహా సెజ్‌లు ప్రారంభమవగా.. వాటిలోనే లీజింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో గణనీయంగా పెరుగడానికి ఆస్కారమున్నది. హైదరాబాద్‌లో ఆఫీసు సముదాయాల్ని తీసుకున్న సంస్థల్లో ఐటీ కంపెనీలు ప్రథమ స్థానంలో ఉండగా.. ఇంజినీరింగ్, ఉత్పత్తి కంపెనీలు ఆ తర్వాతి స్థానంలో నిలిచాయని సీబీఆర్‌ఈ వెల్లడించింది.

ట్రాఫిక్ రహిత నగరం..

దేశంలోని ప్రధాన నగరాల్లోగల ట్రాఫిక్ రణగొణ ధ్వనుల సమస్యను ముందే పసిగట్టిన తెలంగాణ సర్కారు.. పరిష్కార మార్గాల వైపు దృష్టి సారించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వినూత్న చర్యల్ని చేపట్టింది. భాగ్యనగరంలో ఇప్పటికే మెట్రో రైలు సేవలు ప్రారంభమవగా.. కొత్త మార్గాల్లోనూ ప్రారంభించడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ప్రధానంగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయం దాకా ఏర్పాటయ్యే సరికొత్త మెట్రో మార్గం రానున్న రోజుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. ఇదొక్కటే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. కీలకమైన రహదారులకు సర్కారు సరికొత్త సొబగులను అద్దుతున్నది. ఇందుకోసం ఏకంగా హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఐటీ సంస్థలు అధిక ప్రాధాన్యతనిచ్చే మౌలిక సదుపాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటం వల్లే విదేశీ ఐటీ కంపెనీలు భాగ్యనగరం వైపు మొగ్గు చూపుతుండటం విశేషం.

అద్దెలు పెరుగొచ్చు?

రానున్న రోజుల్లో హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల శివారు ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్నది. ప్రధానంగా ఎస్‌ఈజెడ్‌లలో అధిక శాతం సంస్థలు ఐటీ స్థలాన్ని తీసుకుంటాయని సీబీఆర్‌ఈ అంచనా వేస్తున్నది. వచ్చే త్రైమాసికంలో భాగ్యనగరంలో ఐటీ స్థలం తీసుకునే కంపెనీలు అధికంగా ఉండొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నది. నగరానికి చెందిన డెవలపర్లు సైతం కొత్త సముదాయాల్ని విస్తృతంగా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నగర శివారుల్లో అద్దెలు అధికమయ్యే వీలుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.

2344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles