మధ్య తరగతికి ఊరట?

Tue,January 22, 2019 12:20 AM

-తాత్కాలిక బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

సాధారణ ఎన్నికలకు ముందు మరో రెండు వారాల్లో ప్రవేశపెడుతున్న తాత్కాలిక బడ్జెట్‌లో మధ్యతరగతికి ఊరటనిచ్చే అనేక పన్ను ప్రతిపాదనలు ఉండవచ్చు. అయితే, ఈ బడ్జెట్ కేవలం కొన్ని మార్గదర్శకాలకే పరిమితమై, ఎన్నికల తర్వాత వచ్చే పూర్తి స్థాయి బడ్జెట్‌లో పన్ను రాయితీ ప్రతిపాదనలను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రూ. 2.5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపును రూ. 5 లక్షల వరకు పెంచే దిశగా ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. . అయితే, ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్‌లో సంప్రదాయం ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచే ఉద్దేశ్యాలను మాత్రమే ఆర్థిక మంత్రి ప్రస్తావించి ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తే ప్రత్యక్ష పన్ను రాయితీలను అమలు చేస్తామని ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి మార్గదర్శకాలను మాత్రమే ప్రస్తావించిం జూలైలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌లోనే వాటిని అమలు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రస్తుతం వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నెలాఖరుకు తిరిగి వస్తారు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్నందున ఆదాయపన్ను చట్టానికి సవరణ తీసుకురావడానికి అభ్యంతరాలేవీ ఉండవనీ, అయితే ఎన్నికల ముందు అలాంటి ప్రజాకర్షక నిర్ణయాలను ప్రవేశపెట్టి ప్రతిపక్షంతో విబేధాలను పెంచుకోవడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంటుందా అనేదే ప్రశ్న అని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే మళ్లీ అధికారంలోకి వస్తే పన్ను రాయితీలను అమలు చేస్తామన్న హామీని ఆర్థికమంత్రి ప్రకటించే అవకాశాలున్నాయని అన్నారు. పన్ను చట్టాలకు ఎలాంటి సవరణలు లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదాన్ని కోరవచ్చునని భావిస్తున్నారు. ఇతర మనీ బిల్లుల మాదిరిగానే ఫైనాన్స్ బిల్లును కూడా చర్చ తర్వాత లోక్‌సభ ఆమోదాన్ని పొంది ఆ తర్వాత రాజ్యసభలో చర్చ జరగవచ్చు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సంప్రదాయం ప్రకారం తాత్కాలిక బడ్జెట్‌లో పార్ట్ బీ ఉండదు.

ఇందులో పన్ను ప్రతిపాదనలు, పన్ను చట్టాల సవరణ ఉండదు. గతంలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో పరోక్ష పన్నుల ప్రతిపాదనలు చేశారు. అయితే ప్రస్తుతం జీఎస్టీ అమలు జరుగుతున్నందున కేవలం కస్టమ్స్ సుంకాలకు మాత్రమే సవరణలు చేయగలరు. నిజానికి చట్ట ప్రకారంగా చూస్తే ప్రత్యక్ష పన్నులకు తాత్కాలిక బడ్జెట్‌లో సవరణలు చేయరాదన్న నిబంధన ఏదీ లేదు. అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో కంప్లయెన్స్ పెరిగిన నేపథ్యంలో మధ్యతరగతి, వేతన జీవులకు ప్రభుత్వం కృతజ్ఙతలు తెలుపుతుంది. ప్రభుత్వం వారి ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చే జూలైలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌లో అవసరమైన మార్పులను ప్రభుత్వం తీసుకువస్తుంది అని ప్రకటించే అవకాశాలున్నాయని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. గత వారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తూ, ప్రస్తుతం అమల్లో ఉన్న సంప్రదాయాల ప్రకారం ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెడుతుందని వ్యాఖ్యానించారు. సంప్రదాయాలను పక్కన పెట్టకూడదని ఎక్కడా లేదు కానీ కొన్ని సవాళ్లను ఎదుర్కొవడానికి సమయం లేదని అయన అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మధ్య తరగతి, వేతన జీవులకు ఊరట నిచ్చే అనేక ప్రతిపాదను తాత్కాలిక బడ్జెట్‌లోనే ప్రవేశపెడతారని భావిస్తున్నారు.

4283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles