పారిశ్రామికోత్సాహం


Tue,February 13, 2018 12:49 AM

-డిసెంబర్‌లో ఐఐపీ 7.1 శాతంగా నమోదు
-తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో భారీగా వృద్ధిరేటు

IIP
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలో పారిశ్రామికోత్సాహం ఉరకలెత్తింది. తయారీ, క్యాపిటల్ గూడ్స్, నాన్-డ్యూరబుల్ కన్జ్యూమర్ గూడ్స్ రంగాల ప్రదర్శన గొప్పగా నమోదవడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ గతేడాది డిసెంబర్‌లో 7.1 శాతానికి ఎగబాకింది. అంతకుముందు ఏడాది డిసెంబర్‌లో కేవలం 2.4 శాతంగానే ఉందని సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) తెలిపింది. అయితే గతేడాది నవంబర్‌తో పోల్చితే మాత్రం తక్కువే. నవంబర్‌లో 8.8 శాతంగా నమోదైంది. మొదట్లో 8.4 శాతంగానే ఉన్నట్లు ప్రకటించినా.. దాన్ని ఆ తర్వాత 8.8 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. కాగా, తాజా ఐఐపీ వృద్ధిలో తయారీ రంగమే కీలకంగా నిలిచింది. మొత్తం ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన ఉత్పాదక రంగం..

నిరుడు డిసెంబర్‌లో 8.4 శాతం పుంజుకున్నది. 2016 డిసెంబర్‌లో 0.6 శాతం వృద్ధికే పరిమితమైంది. ఇక క్యాపిటల్ గూడ్స్ సూచీ కూడా గతంతో పోల్చితే 6.2 శాతం నుంచి 16.4 శాతానికి ఎగిసింది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ)లో ప్రధానమైన కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్స్ రంగం కూడా 0.2 శాతం నుంచి 16.5 శాతానికి ఎగబాకింది. ఇదిలావుంటే గతేడాది ఏప్రిల్-డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 3.7 శాతం పుంజుకున్నది. అంతకుముందు ఏడాది ఇదే వ్యవధిలో వృద్ధిరేటు 5.1 శాతంగా ఉన్నట్లు సీఎస్‌వో తెలియజేసింది.

247

More News

VIRAL NEWS