డిసెంబర్‌కల్లా టీ-హబ్ ఫేజ్-2

Sun,June 9, 2019 12:29 AM

IInd phase of T Hub will be ready by end of 2019

-ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్‌గా నిర్మాణం
-స్టార్టప్‌లకు చక్కని వేదిక: ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/కొండాపూర్: టీ-హబ్ దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్‌గా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ స్టార్టప్ కాన్‌క్లేవ్ హెచ్‌ఎస్‌ఎక్స్ -2019కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీన్ని ఐఐఐటీ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, టీహబ్, హెడ్ స్టార్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో దాదాపు 600లకుపైగా పెట్టుబడిదారులు, దేశంలోని 23 రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు టీ-హబ్ ద్వారా చక్కని వేదికను అందించిందన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అందుబాటులో ఉన్న టీ-హబ్‌కు ధీటుగా రూ.300ల కోట్లతో టీ-హబ్ ఫేజ్-2ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుత టీ-హబ్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దదని, ఈ ఏడాది చివరి నాటికి ఇది అందుబాటులోకి రాగలదన్నారు. దేశంలోనే అధిక స్టార్టప్ సంస్థలున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిని పొందుతున్నదన్న ఆయన స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ నిధి ఏర్పాటుకూ కృషి చేస్తున్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం కలిగిన రాష్ర్టాలకు ర్యాంకులు ఇస్తున్నదని, ఈ విషయంలో తెలంగాణ వెనుకపడదల్చుకోలేదన్నారు. హైదరాబాద్‌లో స్టార్టప్‌లను ప్రారంభించేందుకు అనువైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్న జయేశ్ రంజన్.. దేశీయ స్టార్టప్‌లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సరికొత్తగా టీ-బ్రిడ్జ్‌ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

దీని ద్వారా స్టార్టప్‌లకు ప్రపంచ మార్కెట్లతో సత్ససంబంధాలు నెలకొంటాయన్నారు. టీ-బ్రిడ్జ్ ద్వారా ఇప్పటికే 100కుపైగా స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్‌లో తమ సేవలను అందిస్తున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో 40కిపైగా జాతీయస్థాయి పరిశోధన ల్యాబ్‌లు.. అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేస్తున్నాయన్న ఆయన స్టార్టప్‌లు చిన్నపాటి బహుళజాతి సంస్థలుగా ఎదుగుతున్నాయన్నారు. టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 4 వేల స్టార్టప్‌లు ఉన్నాయని, దేశీయ స్టార్టప్‌లలో ఇవి 15-20 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. ప్రజా సమస్యలకు వీటి ద్వారా పరిష్కారం అందించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్‌స్టార్ట్ ఎండీ, సహ వ్యవస్థాపకుడు అమిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles