ఐడియా నష్టం రూ.1,107 కోట్లు


Tue,November 14, 2017 12:28 AM

Idea
న్యూఢిల్లీ, నవంబర్ 13: ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,106.80 కోట్ల నష్టం వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. టెలికం పరిశ్రమలో నెలకొన్న విపరీతమైన పోటీ, విధాన పరమైన మార్పులు, జీఎస్టీ అమలులోకి రావడం ఇందుకు కారణమని వెల్లడించింది. త్వరలో వొడాఫోన్‌లో విలీనమవుతున్న ఐడియాకు గతేడాది ఇదే కాలానికి రూ.91.5 కోట్ల లాభాన్ని గడించింది. దేశీయ టెలికం రంగంలో నెలకొన్న పోటీ కారణంగా ధరలు భారీగా తగ్గాయని, ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని, దీంతోపాటు జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ కూడా తన ప్రభావాన్ని మరింత పెంచిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన త్రైమాసికంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19.72 శాతం క్షీణించి రూ.7,465.5 కోట్లకు పరిమితమైందని కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.9,300.3 కోట్లుగా ఉంది. సరాసరిగా ఒక్కో వినియోగదారుడు నుంచి రావాల్సిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.6 శాతం తగ్గి రూ.132కి పరిమితమైంది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీకి రూ.54 వేల కోట్ల అప్పు ఉంది. నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో కంపెనీ షేరు ధర 3.61 శాతం పతనం చెంది రూ.93.55 వద్దకు జారుకున్నది.

ఏటీసీ చేతికి టవర్ల వ్యాపారం

త్వరలో విలీనంకానున్న ఐడియా-వొడాఫోన్‌లకు చెందిన టవర్ల విభాగమైన ఐడియా సెల్యులార్ ఇన్‌ఫ్రాస్టక్చర్ సర్వీసెస్ లిమిటెడ్(ఐసీఐఎస్‌ఎల్)ను అమెరికాకు చెందిన ఏటీసీ టెలికం ఇన్‌ఫ్రాకు విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ రూ.7,850 కోట్లు. దీంట్లో వొడాఫోన్‌కు రూ.3,850 కోట్లు(592 మిలియన్ డాలర్లు), ఐడియాకు రూ.4 వేల కోట్ల(614 మిలియన్ డాలర్లు) నిధులు లభించనున్నాయి. వచ్చే ఏడాది తొలి అర్ధభాగం నాటికి ఈ ఒప్పందం పూర్తికానున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఇరు సంస్థలకు కలిపి 20 వేల టవర్లు ఉన్నాయి. ఈ ఒప్పందానికి నియంత్రణ మండళ్లు అనుమతించాల్సి ఉంటుంది.

211

More News

VIRAL NEWS