వొడా ఎన్ ఐడియా సర్‌జీ!

Tue,March 21, 2017 12:41 AM

-ఒక్కటవుతున్న వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్
-విలీనం తర్వాత దేశంలో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరణ
-లక్షా 55వేల కోట్లకు చేరనున్న విలీన సంస్థ విలువ
-మెర్జర్ తర్వాత వొడాకు 45.1%, ఐడియాకు 26% వాటా

Vodafone
ముంబై, మార్చి 20: దేశీయ టెలికం రంగంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ కంపెనీలు ఒక్కటి కాబోతున్నాయి. ప్రస్తుత నంబర్ వన్ ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్‌ను ఆదాయపరంగా, వినియోగదారుల సంఖ్యపరంగా వెనక్కి నెట్టి దిగ్గజ సంస్థగా ఏర్పడబోతున్నాయి. మెర్జర్ ప్రక్రియ వచ్చే రెండేండ్లలో పూర్తికానుంది. విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు సోమవారం ముంబైలో ఇరు సంస్థల వర్గాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, విలీన సంస్థలో వొడాఫోన్ నామినేట్ చేసే వ్యక్తి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా(సీఎఫ్‌వో) ఉండనున్నట్లు వొడాఫోన్ సీఈవో విట్టోరియో కోలో తెలిపారు. ఈ సమావేశానికి కుమార మంగళం బిర్లా కూడా హాజరయ్యారు. ఈ మెర్జర్ డీల్ పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరుగనుంది. కాకపోతే, మొబైల్ టవర్ల నిర్మాణ సంస్థ ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్ ఇండియాకు ఉన్న 42 శాతం వాటాను మాత్రం ఈ డీల్‌ను మినహాయించనున్నారు. మెర్జర్ తర్వాత ఏర్పడే సంస్థలో బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు 45.1 శాతం వాటా ఉండనుండగా.. ఐడియా 26 శాతం వాటా కలిగి ఉండనుంది. మిగతా వాటా పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతుల్లో ఉండనుంది. విలీన సంస్థ కార్యకలాపాలను వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌కు చెందిన ఆదిత్య బిర్లా గ్రూపు కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ డీల్‌కు సంబంధించి మరిన్ని వివరాలు..

-టెలికం రంగం నియంత్రణ మండలి ట్రాయ్ వద్దనున్న సమాచారం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ చివరినాటికి 20.46 కోట్ల మంది వినియోగదారులున్న వొడాఫోన్‌కు 18.16 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇక 19.05 కోట్ల మంది కస్టమర్లు కలిగి ఉన్న ఐడియా సెల్యులార్‌కు 16.9 శాతం మార్కెట్ వాటా ఉంది. టెలికం రంగంలో నంబర్ వన్ సంస్థ అయిన ఎయిర్‌టెల్.. 26.58 కోట్ల మంది వినియోగదారులతో 23.58 శాతం వాటా కలిగి ఉంది.
-జనవరిలో సీఎల్‌ఎస్‌ఏ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. విలీన సంస్థ వార్షిక టర్నోవర్ రూ.80 వేల కోట్ల స్థాయిలో ఉండవచ్చు. అంటే, ఆదాయపరంగా 43 శాతం మార్కెట్ వాటా కలిగి ఉండనుంది. అలాగే, వినియోగదారుల పరంగా విలీన సంస్థ మార్కెట్ వాటా 40 శాతంగా నమోదుకానుంది. మెర్జర్ ద్వారా ఏర్పడిన సంస్థ దాదాపు 40 కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉండనుంది.
-ఇప్పటివరకు కేటాయించిన మొత్తం స్పెక్ట్రంలో 25 శాతం వాటా విలీన సంస్థ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ డీల్‌కు ఆమోదం లభించాలంటే.. ఒక శాతానికి సమానమైన (రూ.5,400 కోట్ల విలువైన) స్పెక్ట్రాన్ని విక్రయించాల్సి ఉంటుంది.
-స్టాక్ ఎక్సేంజ్‌లకు ఐడియా అందించిన సమాచారం ప్రకారం.. విలీన ఒప్పందంలో భాగంగా సంస్థ మార్కెట్ విలువను రూ.72,200 కోట్లుగా (1,080 కోట్ల డాలర్లు) లెక్కగట్టారు. వొడాఫోన్ ఇండియా మార్కెట్ విలువను రూ. 82,800 కోట్లుగా (1,240 కోట్ల డాలర్లు) నిర్ధారించారు.
-డిసెంబర్ 2016 నాటికి ఈ రెండు సంస్థల నికర రుణ భారం రూ.1.07 లక్షల కోట్లుగా ఉంది.
-ఈ రెండు (వొడాఫోన్, ఐడియా) బ్రాండ్లు మార్కెట్లో తమకున్న సామర్థ్యం దృష్ట్యా కార్యకలాపాలను వేర్వేరుగానే కొనసాగించనున్నాయి. విలీనం పూర్తయ్యాక కొన్నాళ్లలో ఇరు సంస్థలు సమాన వాటా కలిగి ఉండేలా చూస్తామని విట్టోరియో కోలో, కుమార మంగళం బిర్లా తెలిపారు. వొడాఫోన్ నుంచి మరిన్ని షేర్లను కొనుగోలు చేసే హక్కు కలిగి ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
-భారత్‌లో ఎదుర్కొంటున్న రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదం ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని కోలో తెలిపారు. విలీన సంస్థ బోర్డులో వొడాఫోన్, ఐడియా నుంచి చెరో ముగ్గురు సభ్యులను నియమించనున్నట్లు ఆయన వెల్లడించారు.
-మెర్జర్ పూర్తయిన తర్వాత ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొనే ప్రయత్నాలేవీ ఉండబోవని బిర్లా స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా వొడాఫోన్‌కు చెందిన 4.9 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అవసరమయ్యే రూ.3,874 కోట్లు సంస్థ నుంచి కాకుండా ప్రమోటర్లు చొప్పించనున్నట్లు బిర్లా తెలిపారు.

సాహసోపేత ఒప్పందం: కోయ్


ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీన ఒప్పందం టెలికం రంగంలో ఓ సాహసోపేతమైన ముందడుగు అని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కోయ్) అభివర్ణించింది. విలీనం ద్వారా దిగ్గజ సంస్థ ఏర్పడితే దేశీయ కస్టమర్లతోపాటు ప్రభుత్వానికీ ప్రయోజనకరమేనని పేర్కొంది. అయితే, ఈ ఒప్పందానికి సకాలంలో అనుమతులు లభించాలని కోయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్‌కాం-ఎయిర్‌సెల్ డీల్‌కు సీసీఐ ఆమోదం


సంస్థకు చెందిన వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ సేవలను ఎయిర్‌సెల్‌తో విలీనం చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపిందని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) వెల్లడించింది. ఇరు సంస్థల వైర్‌లెస్ కార్యకలాపాలను మెర్జ్ చేయడం ద్వారా రూ.65 వేల కోట్ల విలువైన కంపెనీని ఏర్పాటు చేయబోతున్నట్లు గత ఏడాది సెప్టెంబర్‌లో ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ సంయుక్తంగా ప్రకటించాయి. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో ఇరు వర్గాలకు సమాన (చెరో 50 శాతం) వాటా ఉండనుంది. స్టాక్ ఎక్సేంజ్‌లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇంకా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఈ ఒప్పందానికి ఇప్పటికే అనుమతులు లభించాయి.

ఐడియా షేర్లు ఢమాల్


వొడాఫోన్‌తో విలీన ప్రకటన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఐడియా సెల్యులార్ షేర్లు కుప్పకూలాయి. బీఎస్‌ఈలో 9.55 శాతం పతనమైన ఐడియా స్టాకు ధర రూ.97.60 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 14.73 శాతం క్షీణించి రూ.92 వద్దకు పడిపోయినప్పటికీ చివర్లో కాస్త కోలుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో(ఎన్‌ఎస్‌ఈ) సంస్థ షేర్ల ధర 9.62 శాతం తగ్గి రూ.97.70 వద్ద ముగిసింది. దీంతో ఐడియా మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.3,691.87 కోట్లు తగ్గి రూ. 35,170.13 కోట్లకు పరిమితమైంది. బీఎస్‌ఈలో సంస్థకు చెందిన 27.190 కోట్ల షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎస్‌ఈలో 20 కోట్లకు పైగా స్టాకులు చేతులు మారాయి.

663

More News

మరిన్ని వార్తలు...