పీఎన్‌బీ కుంభకోణంపై ఆడిటర్లకు ఐసీఏఐ నోటీసులు


Mon,April 16, 2018 12:46 AM

icai
ముంబై, ఏప్రిల్ 15: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లో భారీ కుంభకోణానికి పాల్పడి దాదాపు రూ.14 వేల కోట్లు స్వాహా చేయడం వెనుక చార్టర్డ్ అంకౌంటెంట్ల ప్రమేయం కూడా ఉన్నదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తుండటంతో ముంబై బ్రాడీ హౌస్ పీఎన్‌బీ శాఖలోని చట్టబద్ధ చార్టర్డ్ అకౌంటెంట్లందరిక్తి ఐసీఏఐ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) నోటీసులు జారీ చేసింది. 2011-12 నుంచి 2016-17 వరకూ బ్రాడీ హౌస్ పీఎన్‌బీ శాఖలో ఆడిటింగ్ కార్యకలాపాలు నిర్వహించిన చట్టబద్ధ ఆడిటర్లందరి జాబితాను రూపొందించి, ప్రాథమిక విచారణ నిమిత్తం వారిని తమ క్రమశిక్షణా బోర్డు ఎదుట హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీచేసినట్లు ఐసీఏఐ సభ్యుడు ఎస్‌బీ జవారే పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. 2011-17 మధ్య పీఎన్‌బీ బ్రాడీహౌస్ శాఖలో మొత్తం ఎనిమిది మంది చట్టబద్ధ ఆడిటర్లు ఆడిటింగ్ జరిపారని, ఇప్పుడు వీరందరికీ నోటీసులు జారీ అయ్యాయని ఆయన అన్నారు. పీఎన్‌బీ కుంభకోణం వెనుక ఆడిటర్ల తప్పిదం ఏమైనా ఉన్నదేమో తేల్చేందుకు ఐసీఏఐ ప్రయత్నిస్తున్నదని, అందుకే ప్రాథమిక విచారణ కోసం ఎనిమిది మంది ఆడిటర్లకు నోటీసులు జారీచేసిందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఈ ఎనిమిది మందిలో ఎవరినీ దోషులుగా పేర్కొనలేమని, వారు ఐసీఏఐ క్రమశిక్షణా బోర్డు ఎదుట హాజరై సమాధానాలు చెప్పిన తర్వాత గానీ పీఎన్‌బీ కుంభకోణంలో వారి పాత్ర ఏమిటో నిర్ధారించేందుకు వీలవుతుందని జవారే అన్నారు.

221
Tags

More News

VIRAL NEWS