అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా హైదరాబాద్

Fri,May 10, 2019 12:30 AM

Hyderabads Rajiv Gandhi Airport ranked among top 10 in the world

- టాప్-10లో ఎనిమిదో స్థానంలో నిలిచిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- అగ్రస్థానాల్లో ఖతార్ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌వేస్‌లు.. ఎయిర్‌హెల్ప్ సర్వేలో వెల్లడి


న్యూయార్క్, మే 9: ప్రపంచంలోని 10 అత్యుత్తమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటిగా నిలిచింది. టాప్-10లో ఎనిమిదో స్థానం దక్కించుకున్నది. ఎయిర్‌హెల్ప్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ ఏడాదికిగాను విడుదలైన తాజా జాబితాలో దేశంలోని మరే ఎయిర్‌పోర్టూ టాప్-10లో లేకపోవడం గమనార్హం. మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ సంస్థ శంషాబాద్‌లోని ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అత్యాధునిక హంగులతో, దేశ, విదేశీ ప్రయాణీకులను అబ్బురపరుస్తున్న సంగతీ విదితమే. ఏటేటా విమాన ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచుకుంటూపోతున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇప్పటికే పలు విభాగాల్లో ఆకర్షణీయ రికార్డులను కలిగి ఉన్నదీ తెలిసిందే. కాగా, ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి స్థానంలో నిలువగా, తర్వాతి స్థానాల్లో వరుసగా టోక్యో (జపాన్), ఎథేన్స్ (గ్రీస్), అఫోన్సో పెన్నా (బ్రెజిల్), డాన్స్క్ లెచ్ వాసా (పోలాండ్), షెరిమెటియేవో (రష్యా), చాంగి (సింగపూర్), హైదరాబాద్ (భారత్), టెనెరిఫె నార్త్ (స్పెయిన్), విరకోపోస్ (బ్రెజిల్) ఉన్నాయి. విమాన ప్రయాణీకుల హక్కుల పరిరక్షణ, విమానాలు ఆలస్యం, రైద్దెన సమయాల్లో నష్టపరిహారం ఇప్పించడంలో ఎయిర్‌హెల్ప్ సంస్థ బాసటగా నిలుస్తున్నది.

పరమ చెత్త ఎయిర్‌పోర్టు లండన్‌లోనే.

ఇక ప్రపంచంలోనే 10 చెత్త అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్ అన్నింటికంటే ముందుందని తేలింది. రెండో స్థానంలో కెనడాలోని బిల్లి బిషప్ టోరంటో సిటీ ఎయిర్‌పోర్టు ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పోర్టో (పోర్చుగల్), పారిస్ ఓర్లీ (ఫ్రాన్స్), మాంచెస్టర్ (బ్రిటన్), మాల్టా (మాల్టా), హెన్రీ కోండా (రొమేనియా), ఇందోవెన్ (నెదర్లాండ్స్), కువైట్ (కువైట్), లిస్బన్ పోర్టెలా (పోర్చుగల్) ఉన్నాయి.

మరోసారి ఖతార్ ఎయిర్‌వేస్

ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఖతార్ ఎయిర్‌వేస్ వరుసగా రెండో ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. పనితీరు ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఏరో మెక్సికో, ఎస్‌ఏఎస్ స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్, కాంటాస్, లాటమ్ ఎయిర్‌లైన్స్, వెస్ట్‌జెట్, లైగ్జెర్, ఆస్ట్రేలియన్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఉన్నాయి. అలాగే పరమ చెత్త ఎయిర్‌లైన్స్‌ల్లో అడ్రియా ఎయిర్‌వేస్ మొదటి స్థానంలో ఉన్నది. ఏరోలీనియస్ అర్జెంటినాస్, ట్రాన్జావియా, లౌడెమోషన్, నార్వెయిన్, ర్యానైర్, కొరియన్ ఎయిర్, కువైట్ ఎయిర్‌వేస్, ఈజీజెట్, థామస్ కుక్ ఎయిర్‌లైన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా విషయానికొస్తే న్యూజెర్సీ హబ్ పరమ చెత్త ఎయిర్‌పోర్టుగా ఉన్నది.

2145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles