హైదరాబాద్‌లో హౌజింగ్ జోష్

Tue,February 12, 2019 02:13 AM

-నిర్మాణ రంగంలో దక్షిణాది నగరాల హవా
-వెనుకబడ్డ ఉత్తర, పశ్చిమాది ప్రాంతాలు
-భాగ్యనగరంసహా బెంగళూరు,చెన్నైల్లో 20 శాతం వృద్ధి
-గతేడాదికిగాను వెల్లడించిన అనరాక్ ప్రాపర్టీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. సకల సౌకర్యాలు కలిగిన సుందర నగరం కావడంతో ఇక్కడ ఉండేందుకు అంతా అసక్తిని కనబరుస్తున్నారు. అన్ని రంగాల్లో భాగ్యనగరం భేష్ అనిపించుకుంటుండటంతో హౌజింగ్ డిమాండ్ నానాటికీ పెరుగుతూపోతున్నది. దీంతో హైదరాబాద్ నేతృత్వంలోని దక్షిణాది నగరాలు ఇప్పుడు దేశ నిర్మాణ రంగాన్ని శాసిస్తున్నాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో దేశంలోని దక్షిణాది నగరాలతో పోల్చితే ఉత్తరాది, పశ్చిమాది నగరాల్లో హౌజింగ్ డిమాండ్ తక్కువగా ఉన్నట్లు తేలింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో గతేడాది ఇండ్ల గిరాకీ, అమ్మకాలు బాగున్నాయని, ఉత్తర, పశ్చిమాది రాష్ర్టాల్లోని నగరాల్లో ఈ స్థాయిలో కనిపించలేదని పేర్కొన్నది. నిరుడు దక్షిణాది నగరాల్లో హౌజింగ్ డిమాండ్, సైప్లె 20 శాతం వృద్ధి చెందితే, ఉత్తరాది నగరాల్లో 18 శాతం, పశ్చిమాది 15 శాతం వృద్ధిరేటు నమోదైందని వివరించింది. కాగా, 2018లో కొత్త గృహాలు 77 శాతం పెరిగి 67,850 యూనిట్లకు చేరాయని వెల్లడించింది. ఈ విషయంలో విడివిడిగా చూస్తే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కేవలం 16 శాతం వృద్ధి ఉంటే, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె కలిసి 17 శాతం మాత్రమే కొత్త నివాసాల సైప్లె ఉందని అనరాక్ ఈ సందర్భంగా తెలియజేసింది.

పూర్తయిన ఇండ్లకు డిమాండ్


నిర్మాణంలో ఉన్న ఇండ్ల కంటే నిర్మాణం పూర్తయిన ఇండ్లకు భలే గిరాకీ ఉందని, దక్షిణాది నగరాల్లో ఈ డిమాండ్ ఆకర్షణీయంగా ఉందని అనరాక్ ప్రాపర్టీ వెల్లడించింది. హైదరాబాద్‌సహా దక్షిణాది రాష్ర్టాల్లోని ప్రధాన ఏడు నగరాల్లో అమ్ముడుకాని ఇండ్ల శాతం 19 గానే ఉందని చెప్పింది. ఉత్తరాది నగరాలతో పోల్చితే ఇది చాలా తక్కువని స్పష్టం చేసింది. ఒక్క ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే దాదాపు 28 శాతం అమ్ముడుకాని ఇండ్లున్నట్లు తెలిపింది. దీంతో దేశీయ నిర్మాణ రంగంలో దక్షిణాది నగరాల హవా తేటతెల్లం అవుతున్నదన్నది.
Santhosh

ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు కీలకం


హైదరాబాద్‌సహా దక్షిణాది రాష్ర్టాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగం పరుగులు పెట్టడానికి గల ముఖ్య కారణం.. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల కార్యకలాపాలేనని అనరాక్ ప్రాపర్టీ అన్నది. దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో విస్తరణకు పెద్దపీట వేశాయని, అంతర్జాతీయ సంస్థలూ ఇక్కడ ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీంతో ఐటీ ఉద్యోగుల రాక పెరిగి, వారి స్థిర నివాసాలకు ఈ నగరాలు వేదికలవుతున్నాయని ఈ సందర్భంగా అనరాక్ వివరించింది. అయితే ఢిల్లీ ఎన్‌సీఆర్ రియల్టీ మార్కెట్‌లో మాత్రం ఎక్కువగా పెట్టుబడులు ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు చెప్పింది.

ఆఫీస్ స్పేస్‌కు పెరిగిన ప్రాధాన్యం


నివాస గృహాలకేగాక ఆఫీస్ స్పేస్‌కూ దక్షిణాది నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందని అనరాక్ నివేదికలో తేలింది. కార్యాలయాల ఏర్పాటుకు అనువైన నగరం కావడంతో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు అమితంగా డిమాండ్ వ్యక్తమవుతున్నదని, మిగతా దక్షిణాది నగరాల్లోనూ ఇదే తరహా ఆదరణ కనిపిస్తున్నదని స్పష్టం చేసింది. ఇటీవలికాలంలో దేశీయ నిర్మాణ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయని, అయితే దక్షిణాది నగరాలు ఈ సమయంలోనూ తమ సత్తా చాటాయని, దేశ, విదేశీ సంస్థలు ఈ నగరాల వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టడంతో అటు ఆఫీస్ లీజులకు, ఇటు ఇండ్ల అమ్మకాలకు డిమాండ్ వచ్చిందని తెలియజేసింది. నిరుడు దాదాపు 2.1 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగిందని చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి


హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక విధానాలను అవలంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక్కడి నిర్మాణ రంగం అభివృద్ధికీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సులభతర వ్యాపార నిర్వహణలో దేశంలోనే అగ్రపథాన దూసుకెళ్తున్న తెలంగాణపై వ్యాపార, పారిశ్రామిక వర్గాలు చూపిస్తున్న ఆసక్తి భాగ్యనగర నిర్మాణ రంగానికి కలిసొస్తున్నది. అత్యుత్తమ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు రోడ్లు, రైల్వేల వంటి మెరుగైన రవాణా సదుపాయాలున్న హైదరాబాద్‌ను మెట్రో రైలు సేవలు మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి. ఐటీ హబ్, టీఎస్ రెరా, పరిశ్రమల స్థాపనకు అనుమతులు, భూముల కేటాయింపు విషయాల్లో టీఆర్‌ఎస్ సర్కారు విధానాలు కూడా హైదరాబాద్‌ను దేశంలోనే ప్రాధాన్య నగరాల్లో నిలుపుతున్నాయి. నానాటికీ విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం.. దేశీయ నిర్మాణ రంగానికే ఓ దిక్సూచిలా ఎదుగుతున్నదంటే అతిశయోక్తి కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
kcr111

భారతీయ నిర్మాణ రంగంలో నెలకొన్న మందగమనం నుంచి త్వరగా కోలుకున్నది దక్షిణాది నగరాలేనని మా అధ్యయనంతో రుజువైంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ఇండ్ల గిరాకీ ఆకర్షణీయంగా పెరిగింది. కొనుగోళ్లలో ఐటీ రంగం ప్రధాన పాత్ర పోషిస్తున్నది
-సంతోష్ కుమార్, అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వైస్ చైర్మన్

1734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles