బ్యాండ్ భాజాల భాగ్యనగరం!

Mon,November 11, 2019 04:11 AM

-వెడ్డింగ్ హబ్‌గా హైదరాబాద్
-మార్కెట్ విలువ రూ.10 వేల కోట్లపైనే
-జంట నగరాల్లోనే ఏటా 4 లక్షల పెండ్లిళ్లు

హైదరాబాద్, నవంబర్ 10: హైదరాబాద్.. వ్యాపార, పారిశ్రామిక రంగాలకే కాదు.. వివాహాది శుభకార్యాలకూ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అవును.. భాగ్యనగరంలోనే ఇప్పుడు భాజాభజంత్రీలు మోగాలంటున్నారు అంతా. తమ పిల్లల పెండ్లిళ్లకు హైదరాబాద్ మించిన వేదిక ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నదంటే అతిశయోక్తి కాదు. అన్ని రకాల వసతులు, మరెన్నో సదుపాయాలు మనం మెచ్చిన, నచ్చిన విధంగానే అందుబాటులో ఉంటుండటంతో అంతా రాజధాని నగరాన్నే కల్యాణ వేదికగా చేసుకుంటున్నారు. తెలంగాణ జనాభాలో 20 శాతానికిపైగా పెండ్లీడుకు వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలున్నారు. ఇందులో ఏటా 5 శాతం మంది పెండ్లి పీటలెక్కుతున్నారు.

30 శాతం పెరుగుతున్న పరిశ్రమ

నిజానికి భారతీయ వివాహ పరిశ్రమ చాలా పెద్దది. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఏటా 25 నుంచి 30 శాతం ఈ పరిశ్రమ పెరుగుతూపోతున్నదంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు. వచ్చే ఏడాది ఈ వృద్ధి శాతం మరింతగా ఉంటుందని పరిశ్రమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది. ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల పెండ్లిళ్లు జరుగుతున్నాయి. కేవలం రెండు తెలుగు రాష్ర్టాల్లోనే 7.5 లక్షల నుంచి 10 లక్షల జంటలు ఏటా ఒక్కటవుతున్నాయి. ఇందులో 4 లక్షల వివాహాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే జరుగుతుండటం గమనార్హం. వీటిలో సుమారు 1,500ల నుంచి 2 వేల వరకు అట్టహాసంగా జరిగే పెండ్లిళ్లే. దీంతో దక్షిణ భారతంలో వెడ్డింగ్ హబ్.. హైదరాబాదే అయ్యింది. బాలీవుడ్ కండల వీరుడు, ఖాన్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్.. తన ముద్దుల చెల్లి వివాహ వేడుకను హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే జరిపించిన విషయం తెలిసిందే.

ఎన్నారైల డెస్టినేషన్

ప్రవాస భారతీయుల్లో (ఎన్నారైలు) చాలామంది హైదరాబాద్‌లోనే పెండ్లి చేసుకోవాలన్న ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. చారిత్రక నగరం కావడం.. రోడ్డు, రైలు, విమానయాన సౌకర్యాలు మెరుగ్గా ఉండటం, పర్యావరణ పరంగానూ దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ సేఫ్‌జోన్‌గా ఉండటం.. ఎన్నారైల ఆసక్తికి ప్రధాన కారణంగా నిలుస్తున్నది. ఇక ఇక్కడ సుమారు 200 వెడ్డింగ్ డెకరేషన్ నిపుణులున్నారు. 20 నుంచి 30 మంది వెడ్డింగ్ ప్లానర్స్ కూడా ఉన్నారు. షాపింగ్‌కూ బోలెడు అవకాశాలున్నాయి. దుస్తులపరంగానైనా, ఆభరణాలపరంగానైనా హైదరాబాద్‌లో బ్రాండెడ్ షోరూంలకు కొదవే లేదు. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో ఖర్చూ తక్కువేనన్న భావన సైతం ఎన్నారైల వివాహాలకు హైదరాబాద్‌ను వేదిక చేస్తున్నది.

మరో రెండు మారియట్ హోటల్స్

మారియట్ హోటల్స్.. హైదరాబాద్‌లో మరో రెండు అనుబంధ హోటళ్లను తీసుకువస్తున్నది. ఏటా కనీసం 250 వివాహ వేడుకలకు ఆతిథ్యమిస్తున్న మారియట్.. గచ్చిబౌలి వద్ద 281 గదులతో, మాదాపూర్ వద్ద 168 గదులతో కొత్త నిర్మాణాలను సిద్ధం చేస్తున్నది. ఈ నెలలోనే గచ్చిబౌలిలోని లే మెరిడియన్ హోటల్ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో మాదాపూర్‌లోని వెస్టిన్-2 అందుబాటులోకి వస్తుందని లే మెరిడియన్ జీఎం రాకేశ్ ఉపాధ్యాయ్, వెస్టిన్ జీఎం పరాగ్ సాహ్నీ తెలిపారు. తమ ఆదాయంలో 55 శాతం వివాహాది శుభకార్యాల నుంచే వస్తున్నదని హైదరాబాద్ మారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ జీఎం సుదీప్ శర్మ స్పష్టం చేశారు.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles