హెచ్‌ఎస్‌బీసీలో 10 వేల ఉద్యోగాల కోత!

Tue,October 8, 2019 12:32 AM

-వ్యయ నియంత్రణ చర్యల్లో బ్యాంక్
-ఆర్థిక అనిశ్చితే కారణం

హాంకాంగ్, అక్టోబర్ 7: హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌లో భారీ ఎత్తున ఉద్యోగాలు పోనున్నాయి. 10 వేల మంది ఉద్యోగుల్ని తొలగించే దిశగా బ్యాంక్ యాజమాన్యం అడుగులు వేస్తున్నది. వీరంతా కూడా అధిక మొత్తాల్లో జీతాలు తీసుకుంటున్నవారే కావడం గమనార్హం. గత నెల ఈ లండన్ ఆధారిత బ్యాంక్ సీఈవో జాన్ ఫ్లింట్ అనూహ్యంగా రాజీనామా చేయగా, ఆ విషయాన్ని ప్రకటించిన యాజమాన్యం అందుకు కారణాన్ని మాత్రం చెప్పలేదు. ఫ్లింట్ ఆ హోదాలో ఉన్నది కేవలం ఏడాదిన్నరే. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా 10 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని చూస్తుండటం, అదికూడా ఉన్నతస్థాయి ఉద్యోగుల్నే లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్యే హెచ్‌ఎస్‌బీసీ వ్యయ నియంత్రణ చర్యలకు దిగుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ద్వారా తెలుస్తున్నది. ఇక ఈ ఉద్యోగ కోతలు యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తుండగా, అంతర్జాతీయ అనిశ్చితితో ప్రపంచవ్యాప్తంగా 4 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు సమాచారం.

వడ్డీరేట్ల పతనం, బ్రెగ్జిట్, అమెరికా-చైనా సుదీర్ఘ వాణిజ్య యుద్ధం వంటివి ఈ కోతలకు దారితీశాయని హెచ్‌ఎస్‌బీసీ చెబుతున్నదని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎస్‌బీసీలో 2,38,000 మంది పనిచేస్తున్నారు. కాగా, గత నెల జర్మనీకి చెందిన రెండో అతిపెద్ద బ్యాంకైన కామర్జ్‌బ్యాంక్.. 4,300 మంది ఉద్యోగులను తొలగించనున్నామని, 200 శాఖలను ఎత్తేయనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. డ్యూషే బ్యాంక్ 18 వేల మందిని, ఫ్రాన్స్‌కు చెందిన సోషియేట్ జనరెల్లి 1,600 మందిని తీసేస్తున్నట్లు చెప్పాయి. ఈ క్రమంలో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ కూడా ఈ జాబితాలోకి చేరడం అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగాన్ని కలవరపెడుతున్నది.

448
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles