హైదరాబాద్‌లో హిటాచీ గ్లోబల్ సెంటర్

Wed,November 13, 2019 12:29 AM

-ఏడాదిలోగా 600కి చేరుకోనున్న ఉద్యోగులు

హైదరాబాద్, నవంబర్ 12: జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం హిటాచీ లిమిటెడ్ అనుబంధ సంస్థయైన హిటాచీ వంటారా...హైదరాబాద్‌లో గ్లోబల్ డెలివరి సెంటర్‌ను ప్రారంభించింది. ఆసియా దేశాల్లో కంపెనీకి ఉన్న వినియోగదారులకు నూతన టెక్నాలజీ సేవలు అందించే ఉద్దేశంలో భాగంగా ఇక్కడ ప్రాంతీయ డెలివరి సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ఇది నాలుగోది కావడం విశేషం. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నదని, ఇక్కడ నైపుణ్యం కలిగిన సిబ్బంది దొరకడం సులభతరమవుతున్నదన్న ఉద్దేశంతో ఇక్కడే సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు హిటాచీ వంటారా సీఈవో బ్రియాన్ హౌస్‌హోల్డర్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత శక్తివంతంగా వెలుగుతున్న భారత్‌లో టెక్నాలజీ సేవలకు డిమాండ్ నెలకొన్నదని, ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 వేల క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడానికి వీలు పడుతున్నదన్నారు.

సిబ్బందిని రెండింతలు పెంచుకుంటున్న సంస్థ

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ప్రస్తుతం 300 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 600కి పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేవలం అత్యధిక నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వచ్చే జనవరి నాటికి కన్సల్టేషన్ వ్యాపారాన్ని హిటాచీలో విలీనం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. దీంతో గ్రూపులో ఉద్యోగుల సంఖ్య 12 వేలకు చేరుకోనున్నది.

331
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles