జీఎస్టీ అమలు తీరుపై నేడు సమీక్ష


Mon,July 17, 2017 12:46 AM

gst-article
న్యూఢిల్లీ: కొత్త పరోక్ష పన్నుల విధానం అమలులోకి వచ్చి రెండు వారాలైంది. ఈ నేపథ్యంలో చట్టం అమలవుతున్న తీరును జీఎస్టీ మండలి సోమవారం సమీక్షించనుంది. జీఎస్టీ అమలులోకి వచ్చాక జరుగనున్న తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే కానుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఏర్పాటైన జీఎస్టీ మండలికి మొత్తంగా ఇది 19వ సమీక్షా సమావేశం. గత సమావేశాల్లో కేంద్ర, రాష్ర్టాల ఆర్థిక మంత్రులతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఒక్కచోట భేటీ కావడం ద్వారా పలు అంశాలపై చర్చించేవారు. అయితే ఈసారి సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చించుకోనున్నారు. గతనెల 30న సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్.. తదుపరి సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలని నిర్ణయించింది. కానీ చట్టం అమలుతీరుపై దేశవ్యాప్త రిపోర్టు తెలుసుకునేందుకు ముందుగానే సమీక్ష నిర్వహించాలని ఆర్థిక శాఖ భావించింది. అందుకే సోమవారం నాడు ఢిల్లీ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలుతీరును సమీక్షించనున్నారు. జీఎస్టీ అమలులో క్షేత్ర స్థాయిలో పెద్దగా ఇబ్బందులేం ఎదురుకాలేదని ఈమధ్యే జైట్లీ తెలిపారు. ఈనెల 30లోగా జీఎస్టీఎన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని వ్యాపారులకు కేంద్రం సూచించింది.

24 నుంచి ఇన్వాయిస్‌ల ఎంట్రీ!

న్యూఢిల్లీ: ప్రస్తుతం వ్యాపారులకు రిజిస్ట్రేషన్ వసతి కల్పిస్తున్న జీఎస్టీఎన్ పోర్టల్.. ఇన్‌వాయిస్‌ల అప్‌లోడింగ్‌కు సైతం సిద్ధమవుతున్నది. కొత్త పరోక్ష పన్నుల చట్టం పరిధిలోకి వచ్చే వ్యాపారులు ఈనెల 1 నుంచి జరిపిన కొనుగోళ్లు, విక్రయ లావాదేవీలకు సంబంధించిన ఇన్వాయిస్‌లను 24 నుంచి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చని జీఎస్టీఎన్ చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు. నెలాఖరులో అన్ని ఇన్వాయిస్‌లను ఒకేసారి అప్‌లోడ్ చేయడం కంటే రోజువారీగా లేదా వారానికోసారి ఎంట్రీ చేయడం మేలన్నారు. జీఎస్టీ హయాంలో వ్యాపారులు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునేందుకు రూ.200 కంటే అధిక విలువైన లావాదేవీల ఇన్వాయిస్‌లను జీఎస్టీఎన్ పోర్టల్‌లో ఎంట్రీ చేయడం తప్పనిసరి. లావాదేవీల ఎంట్రీకోసం గతనెలలో జీఎస్టీఎన్.. ఆఫ్‌లైన్ ఎక్సెల్ షీట్ ఫార్మాట్‌ను విడుదల చేసింది. దాన్ని వ్యాపారులు తమ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో ఇన్వాయిస్‌లను ఎంట్రీ చేసి. ఒకేసారి జీఎస్టీఎన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

173

More News

VIRAL NEWS