జీఎస్టీ సమావేశానికి ఈసీ గ్రీన్‌సిగ్నల్

Thu,March 14, 2019 12:53 AM

-19న మండలి భేటీ
న్యూఢిల్లీ, మార్చి 13: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినిచ్చింది. లోక్‌సభతోపాటు ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీపై అనుమానాలు తలెత్తాయి. ఆదివారం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో లైన్‌క్లియరైంది. దీంతో ఈ నెల 19న 34వ జీఎస్టీ మండలి సమావేశం జరుగనున్నది. కాగా, రాబోయే సమావేశం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్నట్లు తెలుస్తున్నది. ఈ సమాచారాన్ని మండలిలో సభ్యులుగా ఉన్న అన్ని రాష్ర్టాల ఆర్థిక మంత్రులకు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ నోటీసుల ద్వారా పంపిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.

వచ్చే సమావేశంలో నిర్మాణ రంగానికి జీఎస్టీ రేట్ల తగ్గింపు తదితర అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి పరిశీలించనున్నది. గత సమావేశంలో నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లకు జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి, చౌకధరల గృహాలపై 8 నుంచి ఒక్క శాతానికి మండలి తగ్గించిన సంగతి విదితమే. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. గత నెల ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.97,247 కోట్లకు తగ్గినది తెలిసిందే. జనవరిలో రూ.1.02 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఇప్పటిదాకా (ఏప్రిల్-ఫిబ్రవరి) జరిగిన జీఎస్టీ వసూళ్లు రూ.10.70 లక్షల కోట్లుగా ఉన్నాయి. మూడు నెలల్లో మాత్రమే రూ.లక్ష కోట్లకుపైగా వసూళ్లు జరిగాయి. నిజానికి మొత్తం ఈ ఆర్థిక సంవత్సరానికిగాను జీఎస్టీ వసూళ్లను బడ్జెట్‌లో తొలుత రూ.13.71 లక్షల కోట్లుగా అంచనా వేసినప్పటికీ.. జీఎస్టీ రేట్ల తగ్గింపు తదితర కారణాల మధ్య దాన్ని రూ.11.47 లక్షల కోట్లకు కుదించారు.

670
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles