జీఎస్టీ,వర్షాలే కీలకం!

Mon,June 19, 2017 03:07 AM

GST Council eases rules for return filing for July August

sensex
ఈవారం స్టాక్ మార్కెట్లకు జీఎస్టీ అమలుకు సంబంధించిన పరిణామాలు, రుతుపవనాల పురోగమనం కీలకం కానున్నాయి. జూలై 1 నుంచి జీఎస్టీని అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, చేపట్టే చర్యలు, సంబంధిత వర్గాల సంసిద్ధత, జీఎస్టీ రేట్లు వంటి అంశాలను మార్కెట్ వర్గాలు నిశితంగా గమనించనున్నారు. వర్షపాతం, ఖరీఫ్ సాగుకు సంబంధించిన అంచనాలు కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి.

వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ట్రెండ్, ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులు కూడా స్టాక్ సూచీలు దిశను నిర్దేశించుకోవడంలో తమ వంతు పాత్ర పోషించనున్నాయి. ఎన్‌పీఏల సమస్య పరిష్కారం కోసం బ్యాంకర్లు సోమవారం సమావేశం కానున్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏల పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శులతో ప్రధాని కార్యాలయం(పీఎంవో) సమీక్ష జరుపనుంది.

ఈ రెండు సమావేశాల నిర్ణయాలపైనా ట్రేడర్లు దృష్టిసారించనున్నారు. ఈవారం మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గవచ్చని, కాకపోతే జీఎస్టీకి సంబంధించిన ఏ పరిణామానికైనా మార్కెట్ వర్గాలు స్పందించనున్నారని ఆమ్రపాలీ ఆద్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రిసెర్చ్ విభాగ హెడ్ అభినీశ్ కుమార్ సుధాన్షు అన్నారు. ఈవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు పెద్దగా లేకపోయినందున స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కే అధిక అవకాశాలున్నాయని, మరికొన్ని రోజులు సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడవచ్చని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు.

9,500-9,700 స్థాయిల మధ్య నిఫ్టీ కదలికలు

వరుసగా రెండోవారం స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 205.66 పాయింట్లు, నిఫ్టీ 80.20 పాయింట్లు కోల్పోయాయి. వారాంతంలో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 31,056, నిఫ్టీ 9,588 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లోని టాప్ టెన్ కంపెనీల్లో ఆరింటి మార్కెట్ విలువ రూ.34,183 కోట్లు తగ్గింది. ఈవారం నిఫ్టీకి 9,540-9,500 స్థాయిల వద్ద తక్షణ మద్దతు కన్పిస్తున్నదని టెక్నికల్ నిపుణులంటున్నారు. సూచీలు ఎగువముఖంగా ప్రయాణిస్తే 9,650 వద్ద నిరోధం ఏర్పడవచ్చు. మొత్తంగా ఈవారం నిఫ్టీ 9,500-9,700 మధ్య స్థాయిలో కదలాడవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

ఈనెలలో రూ.23వేల కోట్ల విదేశీ పెట్టుబడులు

దేశీయ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతున్నది. డిపాజిటరీల వద్దనున్న సమాచారం ప్రకారం.. ఈనెల 1 నుంచి 16 వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నికర పెట్టుబడులు ఈక్విటీల్లో రూ.4,022 కోట్లుగా, బాండ్ మార్కెట్లో రూ.18,821 కోట్లుగా నమోదైంది. తద్వారా క్యాపిటల్ మార్కెట్లోకి రూ.22,844 కోట్లుగా తాజా పెట్టుబడులు వచ్చినైట్లెంది. జీఎస్టీ అమలులో పురోగతితోపాటు ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదుకావచ్చన్న అంచనాలు ఇందుకు దోహదపడ్డాయి.

ఈవారంలో రెండు ఐపీవోలు

ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్ ఆఫరింగ్‌ల సందడి నెలకొంది. ఈవారంలో మరో రెండు కంపెనీలు తొలి పబ్లిక్ ఆఫరింగ్‌కు(ఐపీవో) రాబోతున్నాయి. అందులో ఒకటి బీఎస్‌ఈ స్టాక్ ఎక్సేంజ్ ప్రమోట్ చేస్తున్న సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్) కాగా.. మరొకటి హ్యాత్‌వే కేబుల్, డాటాకామ్ లిమిటెడ్‌లకు చెందిన విభాగమైన జీటీపీఎల్ హ్యాత్‌వే. ఈ రెండు సంస్థలు ఐపీవోల ద్వారా రూ.1000 కోట్ల వరకు నిధులు సేకరించే అవకాశం ఉంది. సీడీఎస్‌ఎల్ పబ్లిక్ ఇష్యూ ఈనెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో 3.5 కోట్ల షేర్లను విక్రయించనుంది.

ఇష్యూ ధర శ్రేణిని రూ.145-149గా నిర్ణయించింది. ఈ శ్రేణిలో గరిష్ఠ ధర ప్రకారంగా సంస్థకు ఐపీవో ద్వారా రూ.524 కోట్ల నిధులు సమకూరే అవకాశం ఉంది. ఇక జీటీపీఎల్ హ్యాత్‌వే ఆఫరింగ్ ఈనెల 21-23 తేదీల్లో జరుగనుంది. ఆఫరింగ్ ద్వారా రూ.485 కోట్లు సేకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోభాగంగా రూ.240 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయడంతోపాటు ఓఎఫ్‌ఎస్ విధానంలో 1.44 కోట్ల షేర్లను విక్రయించనుంది.

260

More News

VIRAL NEWS