స్థూల ఆర్థికాంశాలే కీలకం

Mon,February 11, 2019 12:53 AM

Gross economies are crucial

-పారిశ్రామిక వృద్ధి, ద్రవ్యోల్బణ గణాంకాలే సూచీలకు దిశానిర్దేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: గడిచిన వారంలో తీవ్ర ఒత్తిడికి గురైన దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఈ వారంలో స్థూల ఆర్థికాంశాలు కీలకంకానున్నాయి. ఈ వారంలో విడుదలకానున్న పారిశ్రామిక వృద్ధిరేటు, ద్రవ్యోల్బణ గణాంకాలు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పలు అంశాలు సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జీ జిన్‌పింగ్‌లు వాణిజ్య యుద్ధ చర్చలు జరుపాల్సి ఉన్నా.. ఇంకా ఆ దిశగా ఎలాంటి పురోగతి కనిపించట్లేదన్న వైట్‌హౌజ్ వర్గాల ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లు మరోసారి తీవ్ర ఆటుపోటులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతీకార సుంకాల విధింపునకు సంబంధించి ఇరు దేశాల మధ్య మార్చి 1 గడువులోగా చర్చలు జరుగాల్సి ఉన్నది. మరోవైపు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఈ వారం విడుదలకానున్న పారిశ్రామిక ప్రగతి, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సూచీలను ప్రభావితం చేసే అంశాలని ఎపిక్ రీసర్చ్ సీఈవో ముస్తఫా తెలిపారు. మంగళవారం పారిశ్రామిక వృద్ధి గణాంకాలు, గురువారం ద్రవ్యోల్బణ సూచీ విడుదలకానున్నది. వీటితోపాటు కార్పొరేషన్ బ్యాంక్, స్పైస్‌జెట్, ఆంధ్రాబ్యాంక్, అమర రాజా వంటి కార్పొరేట్ దిగ్గజాలు తమ మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను ఈ వారమే విడుదల చేయనున్నాయి. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి గమనం, క్రూడాయిల్ ధరలపై మదుపరులు వేచి చూసే దోరణి అవలంభించవచ్చును. గత వారంలో సెన్సెక్స్ 77.05 పాయింట్లు పెరిగి 36,546.48 వద్ద ముగిసింది.

పదింటిలో ఎనిమిది..


గడిచిన వారంలో టాప్-10 సంస్థల్లో ఎనిమిది కంపెనీల క్యాపిటల్ మార్కెట్ విలువ రూ.53,741.36 కోట్ల మేర పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల అత్యధికంగా లాభపడ్డాయి. కానీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ పడిపోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు పెరిగాయి.

ఎఫ్‌పీఐల రూ.5,300 కోట్ల పెట్టుబడులు


గడిచిన కొన్ని వారాలుగా దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా నిధులను తరలించుకుపోయిన విదేశీ పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) ఈసారి మాత్రం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత నెలలో జరిగిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా రూ.5,300 కోట్ల నిధులను ఈక్విటీ మార్కెట్లలో కుమ్మరించారు. దేశీయ వృద్ధిరేటు మరింత పెరుగుతున్నదన్న అంచనాలు ఇందుకు ప్రధాన కారణం. గతేడాది నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో రూ.5,884 కోట్ల పెట్టుబడుల పెట్టిన ఎఫ్‌పీఐలు..జనవరిలో రూ .5,264 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరి 1-8 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్లలోకి రూ.5,273 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు..డెబిట్ మార్కెట్ల నుంచి మాత్రం రూ.2,795 కోట్లను తరలించుకుపోయ్యారు. డిపాజిటరీల వద్ద ఉన్న సమాచారం మేరకు ఈ విషయం వెల్లడైంది.

గత నెలలో భారీగా విక్రయాలకు మొగ్గుచూపిన ఎఫ్‌పీఐలు..ప్రస్తుత నెలలో ఇప్పటివరకైతే కొనుగోళ్లకు మద్దతు పలికారు. ఇది సానుకూల అంశమని, మిగతా నెలలోనూ ఇదే తీరు కొనసాగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు వెల్లడించారు. వచ్చే మూడు నెలల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు, స్థూల ఆర్థికాంశాల ఆధారంగా ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెట్టవచ్చని చెప్పారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచితే మాత్రం దేశీయ ఈక్విటీ, డెబిట్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని, ఒకవేళ వడ్డీరేట్లను పెంచితే మాత్రం వీటిని తరలించుకుపోనున్నారు.

787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles