పదోన్నతులు.. నియామకాల్లేవ్‌

Mon,July 22, 2019 03:31 AM

Govt tells Air India to freeze all appointments promotions

-ఎయిర్‌ ఇండియాలో ఆగిన సిబ్బంది వ్యవహారాలు
-సంస్థలో వాటా విక్రయానికి
-కేంద్రం సిద్ధమవుతుండటమే కారణం

న్యూఢిల్లీ, జూలై 21: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా.. ఉద్యోగులకు పదోన్నతులు, కొత్త సిబ్బంది నియామకాలను నిలిపివేసింది. సంస్థలో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుండటమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వాటాను అమ్మేందుకు కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే దీన్ని విక్రయించే తంతు త్వరలో మొదలవుతున్నదని ఆదివారం సంస్థ వర్గాలు తెలిపాయి. ఎయిర్‌ ఇండియాకు రూ.50,000 కోట్ల రుణ భారం ఉన్నది. నిజానికి గతేడాది నుంచే ఎయిర్‌ ఇండియా వాటా అమ్మకానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ఇవన్నీ కూడా దారుణంగా విఫలమవుతున్నాయి. ఓవైపు ధర, మరోవైపు నిబంధనలు.. ఆసక్తి ఉన్నవారికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో మార్పులు, చేర్పులతో కొత్త ప్రణాళికను మోదీ సర్కారు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ నెల 15దాకా సంస్థ ఖాతా పుస్తకాలను మూసేశారని, ఈ ఆర్థిక వివరాలను కొత్త బిడ్ల ఆహ్వానంలో వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఓ ఎయిర్‌ ఇండియా అధికారి చెప్పారు. సంస్థలో ప్రస్తుతం దాదాపు 10 వేల మంది శాశ్వత ఉద్యోగులున్నారు.

నాలుగైదు నెలల్లో పూర్తి?

ఎయిర్‌ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణను నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలో గత వారం జరిగిన సంస్థాగత సమావేశంలో అన్ని విభాగాల అధిపతులకు ఎయిర్‌ ఇండియా హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ అమృత శరణ్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు చేరాయి. ఏ ఉద్యోగికి సంబంధించైనా రికవరీ, పెండింగ్‌ అంశాల జోలికి వెళ్లవద్దన్నదే వాటి సారాంశం. కాగా, దీనిపై అటు ఎయిర్‌ ఇండియాగానీ, ఇటు పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాగానీ స్పందించలేదు. దీంతో వాటా అమ్మేదాకా ప్రమోషన్లు, అపాయింట్‌మెంట్లు నిల్‌ అని స్పష్టమవుతున్నది. లావాదేవీ అనంతరం కూడా ప్రభుత్వం చేతిలో 24 శాతం వాటా ఉండటం, యాజమాన్య హక్కులు, అధిక రుణ భారం వంటివి బిడ్డర్లను దూరం చేస్తున్నదని ఓ అధికారి అన్నారు.

లాభాల్లోకి తెచ్చాక..

ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా రోజువారి ఆదాయం రూ.15 కోట్లుగా ఉన్నది. అయితే అప్పుల భారం రూ.50,000 కోట్లు. దీంతో వచ్చే ఆదాయం సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలకే చాలని పరిస్థితి. ఫలితంగా సంస్థ కొనుగోలుకు ఎవరూ సాహసించడం లేదు. దీన్ని గమనించిన కేంద్రం.. సంస్థను తిరిగి లాభాల్లోకి తెచ్చిన తర్వాతే వాటాల ఉపసంహరణకు దిగాలని అనుకుంటున్నది. ఈ నెల 3న రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే సంస్థ నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం అప్పుడప్పుడు ఆర్థిక సాయం చేస్తున్నది తెలిసిందే.

పరిశ్రమలో సంక్షోభం..

దేశీయ విమానయాన పరిశ్రమలో సంక్షోభం ఛాయలు కనిపిస్తుండటం కూడా ఎయిర్‌ ఇండియా వాటా విక్రయానికి ప్రధాన అవరోధంగా నిలుస్తున్నది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూతబడటం, జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా, ఇండిగో లుకలుకలు.. పరిశ్రమ ముఖచిత్రా న్ని భయానకంగా మార్చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరిగిన పోటీ వాతావరణం కూడా విమానయాన రంగానికి లాభాలను దూరం చేస్తున్నది. కాగా, ఎయిర్‌ ఇండియా, దాని నాలుగు అనుబంధ సంస్థలకు చెందిన రూ.29,464 కోట్ల రుణాలను ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేసి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కొంతలోకొంత వాటా విక్రయానికి కలిసి రానుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీపావళి నాటికి వాటా విక్రయాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) కార్యదర్శి అతను చక్రబర్తి ఇప్పటికే చెప్పారు.
Pawanhans

పవన్‌ హన్స్‌ కోసం..

ప్రభుత్వ రంగ పవన్‌ హన్స్‌ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ విఫలమవుతున్న నేపథ్యంలో బిడ్డర్లను ఆకర్షించేందుకు కేంద్రం నిబంధనలను సడలించింది. మార్చిన వాటి ప్రకారం కొనుగోలుదారు సంస్థలోని పర్మినెంట్‌ ఉద్యోగులను కనీసం ఏడాదికాలం పనిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు ఇది రెండేండ్లుగా ఉన్నది. అలాగే ప్రస్తుతం నడుస్తున్న పన్ను వివాదంలో సంస్థకు వ్యతిరేకంగా ఫలితం వస్తే.. కొనుగోలుదారుకు రూ.577 కోట్ల నష్టపరిహారం చెల్లిస్తామన్నది. ఆస్తుల అమ్మకానికి సంబంధించిన కాలవ్యవధిని కూడా మూడేండ్ల నుంచి రెండేండ్లకు తగ్గించింది. పవన్‌ హన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉన్నది. మిగతా 49 శాతం వాటా ఓఎన్‌జీసీకి ఉన్నది. సంస్థకు 43 హెలికాప్టర్లున్నాయి. ఈ హెలికాప్టర్‌ సేవల సంస్థలో వాటా విక్రయానికి గత ఆర్థిక సంవత్సరం మోదీ సర్కారు ప్రయత్నించి విఫలమైంది. ఏ ఒక్కరూ కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో నిబంధనల్లో మార్పులు చేయా ల్సి వచ్చింది. ఈ నెల 5న లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ఎయిర్‌ ఇండియా వాటాను మాత్రమే అమ్మేయబోమని, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా మరిన్ని సంస్థల్లో వాటాలను విక్రయిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ దిశగా సర్కారు ఇప్పు డు అడుగులు వేస్తున్నదని నిపుణులు తాజా పరిస్థితులను విశ్లేషిస్తున్నారు.

486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles