వచ్చే నెలలో టెలికం పాలసీ

Wed,June 13, 2018 12:38 AM

Govt expects new telecom policy to be in place by July

-త్వరలో పోస్టల్ పేమెంట్ బ్యాంకులు
-ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌లకు మూలధనం
-టెలికం మంత్రి మనోజ్ సిన్హా
manoj-sinha
న్యూఢిల్లీ, జూన్ 12: కొత్త టెలికం విధానాన్ని వచ్చే నెలాఖరుకు ప్రకటించనున్నట్టు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. జూలై చివరి నాటికి జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం (ఎన్‌డీసీపీ)కి మంత్రివర్గ ఆమోదం లభించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్, ఈరంగంలోకి రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, సమీప భవిష్యత్‌లో 40 లక్షల మందికి ఉపాధి కల్పన వంటి లక్ష్యాలతో ఈ విధానాన్ని ఇటీవలే రూపొందించినట్టు ఆయన తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి లభించిన వెంటనే పోస్ట్ పేమెట్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. తొలుత 650 శాఖలతో కార్యకలాపాలను ప్రారంభించి క్రమ క్రమంగా దేశవ్యాప్తంగావున్న లక్షన్నర పోస్టాఫీసులకు విస్తరించనున్నట్టు ఆయన వెల్లడించారు. పోస్టల్ శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ప్రారంభించే యోచనలో వున్నట్టు ఆయన తెలిపారు. గత మూడేండ్లలో ఈ రంగంలోకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని టెలికం శాఖ కార్యదర్శి ఎన్ శివశైలం తెలిపారు. 2020 నాటికి రూ.7330 కోట్ల పెట్టుబడితో 4,072 మొబల్ టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల బీఎస్‌ఎన్‌ఎల్ వై-ఫై హాట్ స్పాట్‌లు, రూ. 10,000 కోట్లతో 7 వేల ఈ చౌపాల్‌లను ఏర్పాటు చేయనున్నట్టు శివశైలం తెలిపారు.

అండమాన్, నికోబార్, లక్షద్వీప్‌లకు సబ్ మెరైన్ మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని రూ. 10,834 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు. రక్షణ దళాలకు ప్రత్యేకంగా రూ. 24,000 కోట్ల పెట్టుబడితో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఏడాదిలోగా విమానాల్లో కనెక్టివిటీ (ఐఎఫ్‌సీ)ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు సిన్హా తెలిపారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో మొబైల టారిఫ్‌లు గణనీయంగా తగ్గిపోయాయని సిన్హా అన్నారు. కాల్‌డ్రాప్‌లు కూడా తగ్గిపోయి పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. టెలికం శాఖ సక్సెస్ స్టోరీని కొనసాగించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోదని సిన్హా స్పష్టంచేశారు. ప్రభుత్వం రంగ టెలికం కంపెనీలు ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌లకు మూలధనాన్ని చేకూర్చే అంశాన్ని ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని సిన్హా తెలిపారు. ఈ రెండు కంపెనీ 4జీ స్పెక్ట్రమ్ లేకపోవడాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. పార్లమెంట్ కమిటీ కూడా ఈ రెండు కంపెనీలకు 4జి స్పెక్ట్రమ్ కేటాయించాలంటూ సిఫారసు చేసిందని ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరలో 4జీ స్పెక్ట్రమ్ ను వీటికి కేటాయించడం ద్వారా ప్రైవేట్ రంగం నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొవడానికి వీలవుతుందని పేర్కొన్నారు.

జియో డబుల్ ధమాకా

వినియోగదారులను ఆకట్టుకోవడానికి ముకేశ్ అంబానీ చెందిన టెలికం సంస్థ రిలయన్స్ జియో మరో వినూత్న పథకం ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు ఇస్తున్న 1.5 జీ బీడాటాకు అదనంగా మరో 1.5 జీబీ డాటాను అందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. రూ.149 నుంచి రూ.799 లోపు ప్రీ-పెయిడ్ ప్లాన్‌కు ఈ ఆఫర్ వర్తించనున్నది. రూ.149, రూ.399 ప్యాక్‌లపై 1జీబీ డాటాను అదనంగా అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో ఈ నూతన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గడిచిన నాలుగేండ్లకాంలో డాటా ధరలు 93 శాతం వరకు తగ్గాయని అంతకుముందు టెలికం శాఖ పేర్కొన్నది. అంతకంటే ఎక్కువగానే జియో..రూ.300 రీచార్జిపై రూ.100 రాయితీని, అంతకంటే తక్కువ రీచార్జిపై 20 శాతం రాయితీని ప్రకటించింది. ఈ నెల చివరి వరకు ఈ స్కీం అమలులో ఉండనున్నది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్క జీబీ డాటాకు వెచ్చించే ఖర్చు రూ.1.77 నుంచి రూ.1.56కి తగ్గనున్నది.

1020

More News

VIRAL NEWS