డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యానికి ఆమడ దూరం!

Mon,November 11, 2019 03:48 AM

- ఇప్పటి వరకు సేకరించింది రూ.13 వేల కోట్లే
- రూ.1.05 లక్షల కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేంద్రం

న్యూఢిల్లీ, నవంబర్‌ 10: మిగిలింది నాలుగున్నర నెలలే..సేకరించాల్సింది కొండంత..సేకరించింది అల్పమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా సేకరించాలనుకున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికా ఆమడ దూరంలో ఉన్నది. ఇప్పటి వరకు పలు పీఎస్‌యూల్లో వాటాలను విక్రయించడం ద్వారా సేకరించింది రూ. 12,995.46 కోట్లు మాత్రమే. వీటిలో ఇటీవల ఐపీవోకి వచ్చిన ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ సంస్థ ఐఆర్‌సీటీసీ ద్వారా వచ్చిన రూ.637.97 కోట్లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(దీపం) వెల్లడించింది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఐఆర్‌సీటీసీ వాటాల విక్రయానికి మదుపరుల నుంచి విశేష స్పందన రావడంతో మరిన్ని పీఎస్‌యూల్లో వాటాలను విక్రయించడానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఐపీవోకి ముందు రూ.5,120 కోట్లుగా ఉన్న ఐఆర్‌సీటీసీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ.14 వేల కోట్లకు చేరుకున్నది. దీంట్లోభాగంగా మరో రైల్వే సంస్థయైన రైల్‌టెల్‌ కార్పొరేషన్‌లో 25 శాతం వరకు వాటాను విక్రయించాలనుకుంటున్నది.

జనవరి 2020 మధ్యకాలంలో ఈ వాటాను విక్రయించే అవకాశాలున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కానీ, ఈ భారీ లక్ష్యానికి చేరుకోవాలంటే పూర్తి స్థాయిలో సంస్థనైనా విక్రయించాలి లేదా.. భారీ మొత్తంలో వాటానైనా విక్రయించాలి. గత కొన్ని రోజులుగా ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌)లో ప్రభుత్వానికి ఉన్న 53.29 శాతం వాటాను విక్రయిస్తే రూ.57 వేల కోట్ల నిధులు సమకూరవచ్చునని అంచనా. వీటితోపాటు షిప్పింగ్‌ కార్పొరేషన్‌(63.75 శాతం), కన్‌కోర్‌(30 శాతం), నిప్కో(100 శాతం), టీహెచ్‌డీసీ(75 శాతం)లను విక్రయిస్తే ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం రూ.84 వేల కోట్ల వరకు నిధులు సమకూరవచ్చునని అంచనా.

166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles