ఐదేండ్లలో రూ.2.79 లక్షల కోట్లు

Wed,December 4, 2019 12:39 AM

-డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించిన సర్కారు
-రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గడిచిన ఐదేండ్లలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.2,78,622 కోట్ల నిధులను సేకరించింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ హాయంలో 2004-14 మధ్యకాలంలో రూ.1,07,833 కోట్లు మాత్రమే సేకరించగా, నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ 2014 నుంచి 2014 మధ్యకాలంలో భారీ స్థాయిలో సేకరించినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తర సమయంలో మంత్రి మాట్లాడుతూ..గత ఐదేండ్లలో రెండు రెట్లు అధికంగా సేకరించినట్లు, ప్రతియేటా 21 లావాదేవీలు జరిపినట్లు చెప్పారు. యూపీఏ హాయంలో కేవలం నాలుగు మాత్రమే జరిగాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీంట్లోభాగంగా ఇప్పటికే 33 సంస్థల్లో వాటా విక్రయ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు.

విలీనాలతో ఒక్క ఉద్యోగం పోలేదు

ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయడం వల్ల ఒక్క ఉద్యోగం పోలేదని ఠాకూర్ స్పష్టంచేశారు. పది ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగింటిలో విలీనం చేస్తూ ఆగస్టులో కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బ్యాంకుల విలీనంతో రుణ వితరణ పెరుగడంతోపాటు కోల్‌కతా కేంద్రస్థానంగా పనిచేస్తున్న రెండు బ్యాంకులను విలీనం చేయడంతో తూర్పు రాష్ర్టాల్లో బ్యాంకింగ్ సేవలు అందించడం మరింత సులభతరంకానున్నదన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనంకానుండగా, అలాగే అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌లు కలిసిపోనున్నాయి. బ్యాంకుల విలీనాలతో 50 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశాలున్నాయని తృణముల్ కాంగ్రెస్ సభ్యుడు మనీష్ గుప్తా అడిగిన ప్రశ్నకు ఠాకూర్ స్పందించారు. బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇప్పటివరకు రూ.2.35 లక్షల కోట్ల స్థాయిలో నిధులను కేటాయించినట్లు, దీంతో బ్యాంకులు భారీ స్థాయిలో రుణాలను మంజూరు చేశాయన్నారు.

256
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles