పసిడి మెరుపులు అంతంతే

Mon,November 12, 2018 12:10 AM

Gold price may rebound to Rs 33500 per gram

ముంబై, నవంబర్ 11: గడిచిన కొన్ని సంవత్సరాలుగా అధిక రిటర్నులు పంచిన పసిడి ఈసారి పెట్టుబడిదారులకు షాకివ్వబోతున్నది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాల ధరల్లో ప్రతికూల వృద్ధి నమోదవనున్నదని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 71 స్థాయిలో కదలాడితేనే పదిగ్రాముల బంగారం ధర రూ.33,500గా ఉంటుందని అంచనావేస్తున్నారు. శుక్రవారం బులియన్ మార్కెట్ ముగిసి సమయానికి బంగారం ధర రూ.31,015కి, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ 1,207.70 డాలర్లు పలికింది. గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు, రిటర్నులో మందగమనంతో దేశవ్యాప్తంగా అతి విలువైన లోహాలకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొనే అవకాశాలు కనిపించడం లేదని కామట్రెండ్జ్ రిస్క్ మేనేజ్‌మెంట్స్ డైరెక్టర్ జ్ఞాణశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. మరోవైపు డాలర్ బలపడుతుండటం, జూన్ నుంచి ఆర్బీఐ వడ్డీరేట్లను రెండుసార్లు పెంచడం, వచ్చే నెలలో మరోసారి పెంచుతుందన్న భయాలు బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపనున్నాయన్నారు. పలు ప్రాంతాల్లో రాజకీయ అస్థిరత పరిస్థితులు నెలకొన్నప్పటికీ బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం చూపవని ఆయన స్పష్టంచేశారు.

గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధర 1,185-1,255 డాలర్ల మధ్యలో కదలాడనున్నదని అంచనావేసిన ఆయన..ఒక వేళ డిమాండ్ అధికంగా ఉంటే వచ్చే నెల చివరినాటికి 1,275 డాలర్లకు, డిమాండ్ లేకపోతే 1,160 డాలర్లకు పడిపోవచ్చునని చెప్పారు. దేశీయ ధరల విషయానికి వస్తే రూ.30,250 నుంచి రూ.33,500 మధ్యలోనే కొనసాగనున్నాయన్నారు. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలతో గడిచిన రెండు నెలల్లో పసిడి ధరలు భారీగా పుంజుకున్నాయి. ఆ తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో ధరలు దిగువముఖం పట్టాయి. సెప్టెంబర్ 26న వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో 2.25 శాతానికి చేరుకున్నది. 2015 నుంచి ఇలా వడ్డీరేట్లను పెంచడం ఇది ఎనిమిదోసారి. 2008 ఆర్థిక సంక్షోభం వచ్చిన నాటినుంచి వడ్డీరేట్లు 0.25 శాతంగా ఉన్నాయి. ఒకవేళ మరోదఫా వడ్డీరేట్లను పెంచితే పసిడి విక్రయాలపై ప్రభావం చూపనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతులకు కనీస మద్దతు ధర లభించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు మందగించాయని, ప్రస్తుత పండుగ సీజన్‌లో కూడా పెద్దగా పురోగతి సాధించలేదని చెప్పారు.

1742
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles