ఐఐపీ, ద్రవ్యోల్బణాలే దిక్సూచి

Mon,March 11, 2019 12:52 AM

- దిశానిర్దేశం చేయనున్న స్థూల ఆర్థికాంశాలు
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులూ కీలకమే
న్యూఢిల్లీ, మార్చి 10: దేశీయ స్టాక్ మార్కెట్లకు స్థూల ఆర్థికాంశాలు కీలకంగా మారనున్నాయి. పారిశ్రామిక ప్రగతి, ద్రవ్యోల్బణ గణాంకాలతోపాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. వీటికితోడు క్రూడాయిల్ గమనం, డాలర్‌తో పోలిస్తే రూపాయి, పెట్టుబడుల సరళిపై విదేశీ ఇన్వెస్టర్లు కూడా మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అంశాలని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఫండమెంటల్స్, ఆర్థిక డాటాలు కీలక పాత్ర పోషించనున్నాయని, ఈ వారంలో విడుదల కానున్న ఐఐపీ, టోకు-రిటైల్ ద్రవ్యోల్బణ సూచీల ఆధారంగా స్టాక్ మార్కెట్లు కదలాడనున్నాయని ఎపిక్ రీసర్చ్ సీఈవో ముస్తాఫా నదీమ్ అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ విషయానికి వస్తే ఈ వారంలోనే అమెరికా రిటైల్ విక్రయ గణాంకాలతోపాటు చైనా పారిశ్రామిక వృద్ధిరేటు కూడా విడుదల కానున్నాయి.

ఈ రెండు అనుకూలంగా ఉంటే గ్లోబల్ మార్కెట్లు పరుగులు పెట్టనున్నాయి, కానీ నిరాశాజనకంగా ఉంటే మాత్రం అన్ని మార్కెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. గడిచిన కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా నిధులు కుమ్మరిస్తుండటంతో ఇది ఈక్విటీ మార్కెట్లకు సానుకూల అంశమని చెప్పారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఏదైన జరిగితే మాత్రం తీవ్ర ఒడిదొడుకులకు తప్పవని, ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావడం ఊగిసలాటకు అవకాశాలున్నాయన్నారు. గడిచిన వారంలో దేశీయ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఐటీ, మెటల్ రంగాలకు చెందిన షేర్లకు వచ్చిన స్పందనతో సెన్సెక్స్ 607.62 పాయింట్లు(1.68 శాతం), నిఫ్టీ 171.90 పాయింట్లు(1.58 శాతం) లాభపడ్డాయి. రూపాయి కూడా 78 పైసలు బలపడి 70.14 వద్ద ముగిసింది.

90 వేల కోట్లు పెరిగిన బ్లూచిప్ సంస్థల విలువ

గడిచిన వారంలో బ్లూచిప్ సంస్థల మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడింది. టాప్-10 బ్లూచిప్ కంపెనీల్లో ఎనిమిది నికర విలువ రూ.90.845 కోట్ల మేర పెరిగాయి. వీటిలో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు లాభపడగా, కేవలం హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్ మాత్రం నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ.25,291.28 కోట్లు ఎగబాకి రూ.8,02,855.44 కోట్లకు చేరుకున్నది. అలాగే ఐటీసీ మార్కెట్ విలువ మరో రూ.17,459.57 కోట్లు ఎగబాకి రూ.3,57,829.21 కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరో రూ.12,085.45 కోట్లు బలపడి రూ.5,79,121.61 కోట్లకు చేరుకున్నది. ఐటీ దిగ్గజం టీసీఎస్ రూ.11,501.06 కోట్లు పెరిగి రూ.7,58,844.76 కోట్లకు చేరుకున్నది. దీంతోపాటు ఎస్‌బీఐ రూ.7,407.73 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.4,206.13 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ.2,156.08 కోట్లు ఎగబాకాయి.

ఐదు రోజుల్లో రూ.2,700 కోట్లు


-నిధులు చొప్పించిన ఎఫ్‌పీఐలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా భారీగా పెట్టుబడులు పెడుతున్న ఎఫ్‌పీఐలు..మార్చి నెల గడిచిన ఐదు ట్రేడింగ్‌లలోనూ రూ. 2,700 కోట్ల నిధులను చొప్పించారు. ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ఆశావాద సెంటిమెంట్ ఇందుకు దోహదం చేసిందని విశ్లేషకులు తెలిపారు. దేశీయంగా, అంతర్జాతీయ దేశాల్లో నెలకొన్న పరిస్థితులతో మరి కొన్ని నెలలపాటు ఇదే విధంగా కొనసాగనున్నదని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నెలలో కూడా ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐఎస్)లు ఈక్విటీ, డెబిట్ మార్కెట్లలో రూ.11,182 కోట్ల నిధులను చొప్పించారు. మార్చి 1 నుంచి 8 తేదిలోపు నికరంగా రూ.5,621 కోట్ట పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు..ఇదే సమయంలో రూ.2,880 కోట్లను తరలించుకుపోయారు.

మార్చి 4న మహాశివరాత్రి సందర్భంగా స్టాక్ మార్కెట్లు మూసివేసివుంచారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్‌కు అనుకూలంగా మారుతుండటంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ సర్కార్‌కు మొగ్గుచూపే అవకాశాలు ఉండటం విదేశీ పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ మరింత మెరుగుపడింది. వీటికితోడు ఎఫ్‌పీఐలపై ఉన్న నిబంధనలను రిజర్వు బ్యాంక్ ఎత్తివేయడం కూడా వీరు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. గతంలో కార్పొరేట్ బాండ్లలో కేవలం 20 శాతం వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఎఫ్‌పీఐలకు ఉండేది. దీనిని ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఎత్తివేసింది. ఈ నిర్ణయం కూడా ఎఫ్‌పీఐలు మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి పరోక్షంగా దోహదం చేశాయని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇప్పట్లో వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవని ఫెడరల్ రిజర్వు స్పష్టం చేయడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇక భారత ఈక్విటీ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నారని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అధికారి వీకే విజయకుమార్ తెలిపారు. ఎన్నికలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెట్టుబడులు కొనసాగనున్నాయని ఆయన పేర్కొన్నారు.

721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles