జైట్లీకి ప్రధాన సవాళ్లివే

Thu,February 1, 2018 09:02 AM

gdp

వృద్ధిరేటు

నాలుగేండ్ల కనిష్ఠానికి నీరసించిన జీడీపీని తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం 7.1 శాతంగా నమోదైన వృద్ధిరేటు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.75 శాతానికే పరిమితం అవుతుందన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ 7-7.5 శాతంగా ఉండాలన్న లక్ష్యం నెరవేరడం ఈ బడ్జెట్‌పైనే ఆధారపడి ఉన్నది.

ద్రవ్యలోటు

ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యసాధన కష్టతరంగా మారడం.. ఈసారి బడ్జెట్‌లో వృద్ధిరేటు పురోగతికి ప్రోత్సాహకాలను పరిమితం చేస్తున్నది. ఖజానాపై భారం పడేలా రాయితీలు, పన్ను కోతలు చేస్తే ఆర్థిక క్రమశిక్షణకు భంగం వాటిల్లినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అటు ద్రవ్యలోటును, ఇటు ఆయా రంగాల అభివృద్ధి నిధులను బ్యాలెన్స్ చేయడం జైట్లీకి సవాలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

చమురు ధరలు

దేశీయ ఇంధన అవసరాలు 80 శాతం విదేశీ దిగుమతులపైనే ఆధారపడ్డ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా జైట్లీకి ఈ బడ్జెట్‌లో సవాల్ విసురుతున్నాయి. గతేడాది జూన్ నుంచి గ్లోబల్ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు 40 శాతానికిపైగా పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇవి జీడీపీని ప్రభావితం చేస్తుండగా, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్లు జైట్లీని గట్టిగా తాకుతున్నాయి.

జీఎస్టీ వసూళ్లు

భారతీయ పన్నుల వ్యవస్థను, ముఖ్యంగా పరోక్ష పన్నుల ముఖచిత్రాన్నే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మార్చేసింది. దీనివల్ల దేశ జీడీపీ మందగించిందన్న విమర్శలు వ్యక్తమవగా, సామాన్యులపై మరింత భారం పడిందన్న అపవాదునూ మోదీ సర్కారు మూటగట్టుకున్నది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయమూ తగ్గిపోయింది. జీఎస్టీ వసూళ్లు అంతంతమాత్రంగా ఉన్న వేళ మరిన్ని వస్తువులు, సేవలపై పన్నును తగ్గించాలన్న డిమాండ్ నిజంగా జైట్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.

పన్ను కోతలు

ఆయా శాఖలకు దక్కే నిధులకన్నా.. పన్ను కోతలపైనే బడ్జెట్‌లో ఎక్కువ అంచనాలు వచ్చాయి. ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంపు, కార్పొరేట్ పన్ను తగ్గింపులపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా వర్గాల ఆశలను నెరవేర్చడమూ జైట్లీకి ఓ సవాల్‌గానే తయారైంది. వేతన జీవులైతే బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles