రోజుకు రూ.2,000 కోట్లు

Mon,November 11, 2019 03:51 AM

-తొలి వారంలో రూ.12 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు
న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుండటం, ఆర్థిక సంస్కరణలకు కేంద్రం మొగ్గుచూపడంతో ప్రస్తుత నెల తొలివారంలో ఏకంగా రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు విదేశీ మదుపరులు. తాజాగా డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం మేరకు నవంబర్ 1 నుంచి 9 వరకు ఈక్విటీ మార్కెట్లలోకి రూ.9,433.8 కోట్ల పెట్టుబడులను పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ), డెబిట్ మార్కెట్లలోకి రూ.5,673.87 కోట్లను చొప్పించారు. మొత్తంగా రూ.12,107.67 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు అయింది. వరుసగా రెండు నెలలుగా ఎఫ్‌పీఐలు అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. అక్టోబర్‌లో రూ.16,464.60 కోట్లను, సెప్టెంబర్‌లో రూ.6,557.80 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. సరాసరిగా రోజుకు రూ.550 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే ఎఫ్‌పీఐలు..గతవారంలో ఏకంగా రూ.1,500-2,000 కోట్ల వరకు నిధులు కుమ్మరించారని సామ్‌కో సెక్యూరిటీస్ హెడ్ ఉమేశ్ మెహతా తెలిపారు.


అంతకుముందు రెండు నెలలుగా వరుసగా ఆందోళన వ్యక్తంచేసిన ఎఫ్‌పీఐలు..గత రెండు నెలల నుంచి భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, ముఖ్యంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గావుండటం, మరిన్ని సంస్కరణలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలు పెట్టుబడుల్లో జోష్ పెంచిందన్నారు. ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధిరేటుకు ఊతమివ్వడానికి కేంద్రం పలు చర్యలు ప్రకటించడం, సంపన్న వర్గాలపై సర్చార్జిని ఎత్తివేయడం, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వంటి నిర్ణయాలు ఎఫ్‌పీఐల్లో ఉత్సాహాన్ని నింపాయి. వీటితోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించడం, యూఎస్-చైనా వాణిజ్య యుద్ధం కొలిక్కి వచ్చే అవకాశం ఉండటం కూడా పరోక్షంగా దోహదం చేశాయి.

578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles