పారిశ్రామిక ప్రగతి కీలకం

Mon,June 10, 2019 02:39 AM

FPI FPIs pour in Rs 7,095 crore in first week of June

-రూపాయి, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా
స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్న అంశాలు

న్యూఢిల్లీ, జూన్ 9: గడిచిన రెండువారాలుగా తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనైన స్టాక్ మార్కెట్లు ఈ వారంలో పలు స్థూల ఆర్థికాంశాలు కీలకంగా మారనున్నాయి. ఈవారంలోనే విడుదలకానున్న పారిశ్రామిక వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ ఆధారిత గణాంకాలతోపాటు అమెరికా-చైనా దేశా ల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, ఇంధన ధరలు కూడా మార్కెట్లపై ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలకు నిధుల లభ్యత ఆందోళనకర స్థాయికి చేరుకోవడంతో గతవారంలో భారీగా పడిపోయిన ఈక్విటీ మార్కెట్లు ఈవారంలోనూ జాగ్రత్తపడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

దేశీయ స్థూల ఆర్థికాంశాలతోపాటు రుతుపవనాలు కూడా ఈక్విటీల కదలికలను దిశానిర్దేశం చేయనున్నాయి. వచ్చే నెలలో ప్రవేశపెట్టబోతున్న సార్వత్రిక బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవారంలో ముందస్తు సమావేశాలు ప్రారంభించడం కూడా మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్న అంశాల్లో ఒకటని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికా-మెక్సికో-చైనా ట్రేడ్‌వార్ ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు లేకపోవడం, మరోవైపు ఇంధన ధరలు ఎగువముఖం పడే అవకాశాలు ఉండటంతో మార్కెట్ల పతనం తప్పదని ఆయన పేర్కొన్నారు. బుధవారం పారిశ్రామిక వృద్ధిరేటుతోపాటు మే నెలకుగాను ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కాబోతున్నాయి. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రం శుక్రవారం విడుదల కానున్నది.

ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోరు


-ప్రస్తుత నెలలో రూ.7 వేల కోట్లు
వరుసగా నాలుగు నెలలుగా దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుత నెలలోనూ కొనసాగించారు. ప్రస్తుత నెల తొలివారంలో రూ.7,095 కోట్ల నిధులను క్యాపిటల్ మార్కెట్లలో కుమ్మరించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన సర్కార్ సంస్కరణలను కొనసాగించనుండటం ఇందుకు దోహదం చేస్తున్నది. మే నెలలో రూ.9,031.15 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు..ఏప్రిల్‌లో రూ.16,093 కోట్లు, మార్చి నెలలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలోనూ రూ.11,182 కోట్లను దేశీయ క్యాపిటల్ మార్కెట్ల(ఈక్విటీ, డెబిట్)లోకి నిధులు చొప్పించారు.

తాజాగా డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం మేరకు జూన్ 3 నుంచి 7 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్లలోకి రూ.1,915.01 కోట్లను పెట్టుబడిగా పెట్టిన ఎఫ్‌పీలు..డెబిట్ మార్కెట్లలోకి రూ.5,180.43 కోట్లు చొప్పించారు. రంజాన్ సందర్భంగా గత బుధవారం స్టాక్ మార్కెట్లు పనిచేయలేవు. గతవారంలో ఒక్కరోజు కూడా ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోలేదని గ్రౌవ్ సీవోవో హర్ష జైన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో నిలకడైన ప్రభుత్వం ఏర్పాటుకావడం, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యం 3.4 శాతానికి చేరుకోవడంతో ఎఫ్‌పీఐల్లో నమ్మకాన్ని పెంచిందన్నారు. అలాగే సెన్సెక్స్ రికార్డు స్థాయి 40 వేల మార్క్‌ను చేరుకోవడం కూడా పెట్టుబడులు పెరుగడానికి పరోక్షంగా కారణమైందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడం, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్యయుద్ధ మేఘాలతో వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టడం భారత్‌కు లాభం చేకూరనున్నది.

777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles