ఎఫ్‌డీఐల దూకుడు


Sat,May 20, 2017 12:05 AM

fdi
న్యూఢిల్లీ, మే 19: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోకి 4,348 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 4000 కోట్ల డాలర్లతో పోలిస్తే తొమ్మిది శాతం పెరిగాయి. ఇప్పటివరకు ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో ఎఫ్‌డీఐలు రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశీ పెట్టుబడుల కేంద్రంగా భారత్ అవతరించిందని, ముఖ్యంగా సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు పలు రంగాల్లో పరిమితులను ఎత్తివేయడం ఇందుకు దోహదపడిందని పరిశ్రమల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. తిరిగి పెట్టుబడులు కలుపుకొని గత ఆర్థిక సంవత్సరంలో 6,008 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది వచ్చిన 5,560 కోట్ల డాలర్లతో పోలిస్తే పది శాతం ఎగబాకాయి.

-రికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
-గతేడాది 9 శాతం పెరిగి 4348 కోట్ల డాలర్లుగా నమోదు

గడిచిన మూడేండ్లకాలంలో కేంద్ర ప్రభుత్వం 21 రంగాల్లో ఎఫ్‌డీఐల ప్రమాణాలను మరింత సరళీకరించింది. ముఖ్యంగా నిర్మాణం, బ్రాడ్‌కాస్టింగ్, రిటైల్ ట్రేడింగ్, విమానయానం, బీమా, పెన్షన్ రంగాల్లో ఎఫ్‌డీఐల పరిమితులను ఎత్తివేసింది. సులభంగా వ్యాపారం చేయడంలో పరిస్థితులు మెరుగుపడటం, దిగుమతులను కట్టడి చేయడం, ఉద్యోగ కల్పన, విదేశీ మారకాన్ని పరిరక్షించడానికి కీలక చర్యలు తీసుకోవడం ఎఫ్‌డీఐలు ఆకట్టుకోవడానికి పరోక్షంగా దోహదపడ్డాయి. గడిచిన మూడేండ్లలో ఈక్విటీ మార్కెట్లలోకి 11,441 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2011-14 మధ్యకాలంలో వచ్చిన 8,184 కోట్ల డాలర్లతో పోలిస్తే 40 శాతం పుంజుకున్నాయి. అలాగే 1,169 కోట్ల డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మొత్తం మీద గడిచిన మూడేండ్లలో తయారీ రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 4 శాతం పెరిగి 5,009 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా పథకం ఎఫ్‌డీఐలు ఆకట్టుకోవడంలో కీలక ప్రాతపోషించింది. అక్టోబర్ 2014 నుంచి మార్చి 2017 మధ్యకాలంలో ఎఫ్‌డీఐలు 62 శాతం పెరిగి 9,972 కోట్ల డాలర్లకు చేరాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎఫ్‌డీఐలు కీలకపాత్రపోషిస్తున్నాయని, రేవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులను ఏర్పాటు చేయడానికి మరో లక్ష కోట్ల డాలర్ల(రూ.64 లక్షల కోట్లు) నిధులు అవసరమవుతాయని అంచనా.

179

More News

VIRAL NEWS