ఎయిర్ ఇండియాకు ప్యాకేజీ

Thu,October 11, 2018 02:21 AM

Financial package for Air India likely by this month

పౌరవిమానయాన కార్యదర్శి చౌబే
హైదరాబాద్, అక్టోబర్ 10: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల రోజుల్లోగా పునరుద్దరణ ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉన్నదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ టర్మినల్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం చౌబే మాట్లాడుతూ..నిర్వహణ ఖర్చులు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలను ఆదుకోవడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నదని, ఇదే క్రమంలో ఎయిర్ ఇండియాకు త్వరలో భారీ స్థాయిలో నిధులను కేటాయించే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పారు. దేశ ఆర్థిక, మార్కెట్ పరిస్థితులు కుదుటపడిన తర్వాతనే సంస్థల్లో వాటాను విక్రయించాలనుకుంటున్నట్లు ఆయన అన్నారు.

విమాన ఇంధన ధరలు భారీగా పెరుగడంతోపాటు రూపాయి క్షీణత గడిచిన రెండు త్రైమాసికాలుగా విమాన సంస్థల లాభాలపై ప్రభావం పడిందన్నారు. వీటికితోడు నిర్వహణ ఖర్చులు తడిసి మోపడువుతుండటంతో వీటిని తగ్గించడానికి కేంద్రం కూడా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెకిన్ సమయాన్ని తగ్గించడానికి మొబైల్, ఆధార్ ద్వారా ముఖాన్ని గుర్తించడంతో నేరుగా విమానాశ్రయంలో అడుగుపెట్టే విధంగా టెక్నాలజీని ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం మరో రెండేండ్లపాటు సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల సంస్థల నిర్వహణ భారం భారీ స్థాయిలో తగ్గేందుకు ఆస్కారం ఉందన్నారు.

మార్చి నాటికి 2 కోట్ల మంది ప్రయాణికులు: కిశోర్

విమాన ప్రయాణికులను ఆకట్టుకోవడంలో జీఎంఆర్ విమానాశ్రయం దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ప్రయాణికుల సంఖ్య 2 కోట్లకు చేరువయ్యే అవకాశాలున్నాయని ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ తెలిపారు. 2015లో కోటి మంది ప్రయాణించగా, 2018 నాటికి రెండింతలు పెరిగి 1.8 కోట్లకు చేరుకోగా, వచ్చే మార్చి నాటికి రెండు కోట్లకు చేరుకునేదానిపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. గడిచిన మూడేండ్లకాలంలో అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికుల్లో వృద్ధి 20 శాతానికి పైగా ఉందన్నారు. ప్రయాణికుల సంఖ్య ప్రతియేటా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటుండటంతో వచ్చే మూడేండ్లకాలంలో విమానాశ్రయ సామర్థ్యాన్ని 3.4-4 కోట్లకు పెంచడానికి ఇప్పటికే విస్తరణ ప్రణాళికను ప్రారంభించినట్లు చెప్పారు.

23 నుంచి అందుబాటులోకి అంతర్జాతీయ టర్మినల్

అంతర్జాతీయ ప్రయాణికులకోసం జీఎంఆర్ విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టర్మినల్(ఐఐడీటీ) ఈ నెల 23 నుంచి అందుబాటులోకి రానున్నది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ టర్మినల్‌కోసం సంస్థ రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఈ టర్మినల్‌లో 40 వరకు చెక్‌ఇన్ పాయింట్లు, 20 ఇమ్మిగ్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కేవలం ఆరు నెలల్లో ఈ టర్మినల్‌ను పూర్తి చేయడం విశేషం. ప్రీ-ఇంజినీరింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ టర్మినల్‌ను ఎక్కడికైనా తరలించవచ్చును.

954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS