పీఎఫ్‌పై 8.65% వడ్డీకి ఆర్థిక శాఖ ఓకే


Fri,April 21, 2017 12:31 AM

EPFO
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: గత ఆర్థిక సంవత్సరానికి (2016-17) పీఎఫ్ ఖాతాల్లోని సొమ్ముపై 8.65 శాతం వడ్డీ చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. వడ్డీచెల్లింపునకు సంబంధించి ఆర్థిక శాఖతో సంప్రదింపులు ముగిశాయని, త్వరలోనే ఆమోద సమాచారం రానుందన్నారు. ఆ తర్వాత ఇందుకు సంభదించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, వడ్డీసొమ్మును పీఎఫ్ చందాదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించినదానికంటే తక్కువ వడ్డీ లభించవచ్చన్న ఆందోళనకు కార్మిక మంత్రి అధికారిక ప్రకటనతో తెరపడింది. గతసారికి 8.65 శాతం వడ్డీ చెల్లించాలని డిసెంబర్ 2016లో కార్మిక మంత్రి అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈపీఎఫ్‌వో నిర్ణయానికి ఆర్థిక శాఖ తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. పీఎఫ్ వడ్డీ చెల్లింపుల తర్వాత వార్షిక రిటర్నుల్లో లోటు ఏర్పడే పరిస్థితి లేకుండా జాగ్రత్త పడాలని కేంద్ర కార్మిక శాఖకు ఆర్థిక శాఖ సూచించినట్లుగా సమాచారం. గతసారికి ఆర్జించిన మొత్తం రిటర్నుల నుంచి చందాదారులకు 8.65 శాతం వడ్డీ చెల్లించాక కూడా ఈపీఎఫ్‌వో వద్ద రూ.158 కోట్ల మిగులు ఉండనుంది.

242

More News

VIRAL NEWS