జీఎస్టీ నష్టం తప్పేదెలా?

Sun,September 9, 2018 11:51 PM

Finance Ministry crafting strategy to boost GST revenues

-జూన్-జూలైలో నాలుగింతలైన నష్టపరిహారం
-రాష్ర్టాల వసూళ్ల పెంపునకు కేంద్రం వ్యూహాత్మక అడుగులు
-జీఎస్టీ అధికారులతో ఆర్థిక శాఖ చర్చలు
-ప్రతిబంధకాలను గుర్తించి ఆదాయం పెరిగేలా సమాలోచనలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు పెరుగడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. వివిధ సమస్యల పరిష్కారార్థం రాష్ర్టాలతో చర్చలు, సంప్రదింపులు, సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ ఏడాది జూన్-జూలైకిగాను రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జీఎస్టీ నష్టపరిహారం దాదాపు నాలుగింతలు ఎగిసిన నేపథ్యంలో ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అధియా.. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర పన్ను శాఖలకు చెందిన జీఎస్టీ అధికారులతో సమావేశాలకు శ్రీకారం చుట్టారు. రాష్ర్టాలకు జీఎస్టీ ఆదాయం పెరిగితే నష్టపరిహార భారం కేంద్రంపై తగ్గుతుందన్న ఆలోచనతో ఆయా రాష్ర్టాల్లో జీఎస్టీ వసూళ్లకు ప్రతిబంధకాలను గుర్తించే దిశగా నడుం బిగించారు. ఇప్పటికే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చెరి, జమ్ముకశ్మీర్ అధికారులతో అధియా చర్చలు జరిపారు. ఈ నెలాఖర్లో బీహార్, ఉత్తరాఖండ్ అధికారులతో సమావేశం కానున్నారు.

జూన్, జూలై నెలలకుగాను జీఎస్టీ కారణంగా నష్టపోయిన ఆదాయం నిమిత్తం రాష్ర్టాలకు కేంద్రం రూ.14,930 కోట్లను చెల్లించింది. ఏప్రిల్, మే నెలలతో పోల్చితే ఇది సుమారు నాలుగు రెట్లు ఎగబాకింది. ఈ నెలల్లో రూ.3,899 కోట్లుగానే ఉన్నది. దీంతోనే రాష్ర్టాల జీఎస్టీ ఆదాయం పెరిగేలా కేంద్రం సమాలోచనలకు సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ప్రతి నెలా జీఎస్టీ ద్వారా రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని అందుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఏప్రిల్ మినహా ఇప్పటిదాకా ఏ నెలలోనూ ఆ లక్ష్యం నెరవేరలేదు. మేలో రూ.94,016 కోట్లుగా, జూన్‌లో రూ.95,610 కోట్లుగా, జూలైలో రూ.96,483 కోట్లుగా, ఆగస్టులో రూ.93,960 కోట్లుగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఒకే దేశం.. ఒకే పన్ను.. ఒకే మార్కెట్ పేరుతో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గతేడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అప్పటిదాకా ఉన్న పన్నెండుకుపైగా కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకం చేస్తూ పరిచయమైన ఈ జీఎస్టీలో 0, 5, 12, 18, 28 శాతం శ్లాబులను పెట్టారు.

బంగారంపై ప్రత్యేకంగా 3 శాతం, ముడి వజ్రాలు, ఇతరత్రా రత్నాలపై కనిష్ఠంగా 0.25 శాతం చొప్పున పన్ను వేసిన కేంద్రం.. పెట్రోలియం ఉత్పత్తులు, మద్యంపై మునుపటి పన్ను విధానాన్నే కొనసాగించింది. విద్య, వైద్యంతోపాటు తాజా కూరగాయలు, ఇతరత్రా కొన్నింటికి పన్ను మినహాయింపునిచ్చింది. ఈ క్రమంలోనే జీఎస్టీ అమలుకు సహకరించినందుకుగాను రాష్ర్టాలకు మొదటి ఐదేండ్లపాటు నష్టపరిహారం చెల్లిస్తామని హామీనిచ్చింది. ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరం (2017-18) రూ.41,147 కోట్లను విడుదల చేసింది. అయితే వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాల మధ్య ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తుండటంతో వసూళ్లు పడిపోయి రాష్ర్టాలకిచ్చే నష్టపరిహారం పెరుగుతూపోతున్నది. ఇదిప్పుడు కేంద్రాన్ని కలవరపెడుతున్నది. ఫలితంగానే నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. కాగా, జీఎస్టీ ఎగవేతలపై దృష్టి పెడుతున్నామని, అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న 30 మందిపై నిఘా పెట్టి.. జీఎస్టీ అమలుకి ముందు, తర్వాత వారి చెల్లింపులు ఎలా ఉన్నాయన్నదాన్ని పరిశీలించనున్నట్లు ఓ అధికారి చెప్పారు.

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles