ఎగుమతులు ఢమాల్

Sat,September 14, 2019 03:22 AM

Exports were again sluggish

-ఆగస్టు నెలలో 6 శాతం క్షీణత
-13 శాతం తగ్గిన దిగుమతులు
-13.45 బిలియన్ డాలర్లకు వాణిజ్యలోటు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:ఎగుమతులు మళ్లీ నీరసించాయి. పెట్రోలియం, ఇంజినీరింగ్, చర్మ, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీలకు చెందిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు అంతకంతకు పడిపోయాయి. ఆగస్టు నెలకుగాను ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 6.05 శాతం క్షీణించి 26.13 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దిగుమతులు 13.45 శాతం తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. గత నెలలో భారత్ 39.85 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 13.45 బిలియన్ డాలర్లుగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఆగస్టు 2016 తర్వాత దిగుమతులు ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. రెండేండ్ల క్రితం దిగుమతులు 14 శాతం తగ్గాయి. వాణిజ్య లోటు 17.92 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత నెలలో 30 కీలక రంగాల్లో 22 ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోవడం ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతుల్లో కేవలం 3.5 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఇంజినీరింగ్ గూడ్స్‌లో 9.35 శాతం, పెట్రోలియం ఉత్పత్తుల్లో 10.73 శాతం పెరుగుదల కనిపించింది. వీటితోపాటు ఇనుప ఖనిజం, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, సముద్రపు ఉత్పత్తులు కూడా ఆశాజనక పనితీరు కనబరిచాయి.

ఈ ఏడాదంతా అంతంతే..

ప్రస్తుత సంవత్సరంలో ఎగుమతుల్లో ఎలాంటి వృద్ధి కనిపించలేదు. జనవరి నుంచి ఆగస్టు వరకు వృద్ధి సింగిల్ డిజిట్‌లోనే నమోదవగా, కొన్ని నెలలు ప్రతికూలానికి కూడా పడిపోయాయి. దేశ ఆర్థిక రంగం మందకొడిగా కొనసాగుతుండటం, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వృద్ధి ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వంటి అంశాలు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి. వీటికి తోడు జూలైలో పారిశ్రామిక వృద్ధి 4.3 శాతానికి పరిమితమైంది. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ..వచ్చే ఐదేండ్లలో దేశీయ ఎగుమతులు లక్ష కోట్ల డాలర్లకు పెంచాలనుకుంటున్నట్లు చెప్పిన మరుసటి రోజే ఎగుమతులు నిరాశాజనకంగా ఉన్నట్లు గణాంకాలు విడుదల కావడం విశేషం. గత నెలలో భారత్ 10.88 బిలియన్ డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసుకున్నది. ఏడాది క్రితం చేసుకున్న దాంతో పోలిస్తే 8.9 శాతం తగ్గాయి.

అలాగే నాన్-ఆయిల్ దిగుమతులు కూడా 15 శాతం తగ్గి 28.71 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి దిగుమతులు 62.49 శాతం తగ్గి 1.36 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఎగుమతులు 1.53 శాతం క్షీణించి 133.54 బిలియన్ డాలర్లకు చేరగా, ఇదే సమయంలో దిగుమతులు 5.68 శాతం పెరిగి 206.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు తగ్గుముఖం పట్టిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడానికి ఇదే మంచి తరుణమని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. మర్చేండీస్ ఎక్స్‌పోర్ట్ ఫ్రమ్ ఇండియా స్కీం(ఎంఈఐఎస్)ను విరమించుకోకూడదని సూచించింది. కేంద్రం వెంటనే ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ పాలసీని మరింత సరళతరం చేయాలని, దీంతో తయారీదారులు, దిగుమతిదారులను ప్రోత్సహించినట్లు అవుతున్నదని పేర్కొన్నారు. ప్రపంచదేశాల్లో నెలకొన్న అనిశ్చితి, డిమాండ్ లేకపోవడం, టారిఫ్ వార్ మరింత ముదురుతుండటంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ తెలిపారు.

నెమ్మదిస్తున్న భారత వృద్ధి

వెల్లడించిన ఐఎంఎఫ్
భారత ఆర్థిక వృద్ధి ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజాగా వెల్లడించింది. దేశీయ ఆర్థిక రంగం మందగమనానికి కార్పొరేట్, పర్యావరణ రంగానికి సంబంధించి నియంత్రణల్లో నెలకొన్న అనిశ్చితే కారణమని పేర్కొంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బలహీన పడటం కూడా దేశ ఆర్థిక వృద్ధి పతనానికి ప్రధాన కారణమని ఐఎంఎఫ్ ప్రతినిధి జెర్రీ రైస్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. జూలై నెలలో ఐఎంఎఫ్ విడుదల చేసిన అంచనాల్లో ప్రస్తుతేడాది 7 శాతంగాను, వచ్చే ఏడాది 7.2 శాతంగా ఉంటుందని వెల్లడించింది. అయిన చైనా, అమెరికా కంటే వేగవంతమైన వృద్ధిరేటును నమోదు చేస్తున్నదని స్పష్టం చేసింది. ఇటీవల భారత వృద్ధి గణాంకాలపై ఆయన స్పందిస్తూ.. దేశీయ ఆర్థిక పరిస్థితులపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 2012-13లోని జనవరి-మార్చి మధ్యకాలానికి భారత వృద్ధి 4.3 శాతంగా నమోదైంది.

432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles