ఎగుమతులకు జీఎస్టీ సెగ!

Wed,November 15, 2017 12:23 AM

Exports hit by GST fall 1.1 Percent in Oct

-అక్టోబర్‌లో 1.12 శాతం క్షీణత
-14 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు
trade-deficit
న్యూఢిల్లీ, నవంబర్ 14: ఎగుమతిదారులకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సెగ తగిలింది. గాడిలో పడ్డాయనుకున్న దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. జీఎస్టీ చెల్లింపులు చేస్తున్న ఎగుమతిదారులు.. నగదు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుండగా, మంగళవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెల ఎగుమతులు 1.12 శాతానికి పడిపోయి 23.09 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో 23.36 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఏడాదికిపైగా కాలం తర్వాత ఎగుమతులు నెగెటివ్ జోన్‌లోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 6 నెలల గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. ఎగుమతుల క్షీణత ఊహించినదేనని, నాలుగు నెలలుగా జీఎస్టీ చెల్లింపులు జరుపుతున్న ఎగుమతిదారులకు రిఫండ్ ఇంతవరకు అందకపోవడమే కారణమని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) తెలిపింది.

నిరుడు ఆగస్టు తర్వాత ఎగుమతులు తొలిసారిగా దిగజారాయని ఓ ప్రకటనలో పేర్కొంది. పరిస్థితుల్లో మార్పులు రానైట్లెతే ప్రస్తుత నెలలోనూ ఎగుమతులు పడిపోవడం ఖాయమనడం గమనార్హం. కాగా, టెక్స్‌టైల్స్, ఔషధ, తోలు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు పడిపోవడం.. ఈసారి అక్టోబర్ ఎగుమతులను ప్రభావితం చేసింది. అయితే పెట్రోలియం 14.74 శాతం, ఇంజినీరింగ్ 11.77 శాతం, కెమికల్స్ ఎగుమతులు 22.29 శాతం పెరిగినట్లు కేంద్రం తెలియజేసింది. మరోవైపు దిగుమతులు 37.11 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఇది 7.6 శాతం అధికం.ఈ క్రమంలోనే వాణిజ్య లోటు 14.02 బిలియన్ డాలర్లకు చేరగా, నిరుడు 11.13 బిలియన్ డాలర్లుగానే ఉంది. గతంతో పోల్చితే బంగారం దిగుమతులు 16 శాతం పడిపోయి 2.94 బిలియన్ డాలర్లకే పరిమితమైనప్పటికీ, చమురు, చమురేతర దిగుమతులు మాత్రం 27.89 శాతం, 2.19 శాతం చొప్పున ఎగిశాయి. మరోవైపు నిరుడుతో పోల్చితే ఈ ఏప్రిల్-అక్టోబర్‌లో దేశీయ ఎగుమతులు 9.62 శాతం పెరిగి 170.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 22.21 శాతం ఎగబాకి 256.43 బిలియన్ డాలర్లుగా ఉండగా, వాణిజ్య లోటు 86.14 బిలియన్ డాలర్లుగా ఉంది.

167
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS