ఎగుమతుల్లో నీరసం

Thu,May 16, 2019 02:25 AM

Export growth almost flat in April imports rise 4.5

-నాలుగు నెలల కనిష్ఠానికి క్షీణత.. ఐదు నెలల గరిష్ఠానికి చేరిన వాణిజ్య లోటు
న్యూఢిల్లీ, మే 15: దేశీయ ఎగుమతుల్లో మళ్లీ నీరసం ఆవరించింది. గడిచిన కొన్ని నెలలుగా రెండంకెల వృద్ధిలో దూసుకుపోయిన ఎగుమతులు ఏప్రిల్ నెలకుగాను వృద్ధి 0.64 శాతానికి పరిమితమైంది. ఇంజినీరింగ్ గూడ్స్, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, లెదర్, ఇతర ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ లేకపోవడంతో నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఇదే సమయంలో దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. గడిచిన ఆరు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి పనితీరు. దీంతో వాణిజ్య లోటు ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. క్రూడాయిల్, పసిడి దిగుమతులు అమాంతం పెరిగాయి.

గత నెలలో 26 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన భారత్..ఇదే నెలలో 41.4 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకున్నది. వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 15.33 బిలియన్ డాలర్లు. నవంబర్ 2018 తర్వాత వాణిజ్యలోటు ఇదే గరిష్ఠమని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇంజినీరింగ్, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, లెదర్, కార్పెట్, ప్లాస్టిక్, సముద్ర ఉత్పత్తులు, బియ్యం, కాఫీ ఎగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదవడంతో మొత్తం పనితీరుపై ప్రభావం చూపాయి. గతంలో 0.34 శాతం వృద్ధిని డిసెంబర్ 2018 నెలలో కనబరిచింది. ఇప్పటి వరకు ఇదే చారిత్రక కనిష్ఠ స్థాయి. గత నెలలో భారత్ 11.38 బిలియన్ డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో చేసుకున్న దాంతో పోలిస్తే 9.26 శాతం అధికం. అలాగే చమురేతర దిగుమతులు 2.78 శాతం పెరిగాయి.

భారీగా పెరిగిన పసిడి దిగుమతులు

కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న పసిడి దిగుమతులు మళ్లీ ఝులువిదిల్చాయి. గత నెలలో 3.97 బిలియన్ డాలర్ల విలువైన పసిడి వచ్చిచేరింది. ఏడాది క్రితం దిగుమతి చేసుకున్న దాంతో పోలిస్తే 54 శాతం అధికం. పెట్రోలియం, హస్తకళలు, రెడీ-మేడ్ దుస్తులు, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల్లో ఆశావాద వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గత నెల గణాంకాలు ఆకట్టుకునే స్థాయిలో లేవని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(టీపీసీఐ) వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ ఉత్పత్తులకు వచ్చిన దన్నుతోపాటు టీ, పండ్లు, కూరగాయల ఎగుమతులు ఆశించిన స్థాయిలో పెరుగుతున్నాయని టీపీసీఐ చైర్మన్ మోహిత్ సింగ్లా తెలిపారు. ఎగుమతుల గణాంకాలు ప్రోత్సహకరంగా లేవని, కార్మిక రంగాల్లో ప్రతికూలానికి పడిపోయాయన్నారు.

సరినన్ని నిధుల లభించకపోవడంతో అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, వీటితోపాటు వాణిజ్య యుద్ధమేఘాలు, రక్షణాత్మక చర్యలు దేశీయ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. క్రూడాయిల్ దిగుమతి అధికమవుతుండటంతో భవిష్యత్తులో వాణిజ్యలోటు మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దన అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు ఇతర దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

566
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles