ఇండిగో, గో ఎయిర్ సంస్థలపై డీజీసీఏ ఆగ్రహం

Tue,March 13, 2018 02:10 AM

Eleven Airbus 320 neo planes of both IndiGo and GoAir will have to be grounded DGCA

11 విమానాల దింపివేతకు ఆదేశం.. ఇంజిన్ల వైఫల్యాలే కారణం

న్యూఢిల్లీ, మార్చి 12: ఇండిగో ఎయిర్‌లైన్స్, గో ఎయిర్ సంస్థలకు చెందిన 11 ఏ-320 నియో విమానాలను తక్షణమే కిందికి దింపేయాలని దేశీయ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) సోమవారం ఆదేశించింది. వీటిలో ఇండిగో సంస్థకు చెందిన ఎనిమిది విమానాలు, గో ఎయిర్‌కు చెందిన మూడు విమానాలు ఉన్నాయి. ఆ విమానాల్లో అమర్చిన ప్రాట్ అండ్ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజిన్లు తరచుగా విఫలమవుతుండమే ఇందుకు కారణం. నెల రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే మూడుసార్లు ఇటువంటి వైఫల్యాలు తలెత్తడంతో డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణ సమయంలో ఇంజిన్ వైఫల్యం వలన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాన్ని సోమవారం ఉదయం అత్యవసరంగా అహ్మదాబాద్‌లో దించేయాల్సి వచ్చింది.

దీంతో ఇటువంటి విమానాల భద్రత పట్ల ఆందోళనలు పెరగడం, మరోవైపు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయా సంస్థల నుంచి ఇప్పటివరకూ స్పష్టమైన ప్రతిపాదన రాకపోవడంతో డీజీసీఏ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పౌర విమానయాన సేవల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే పీడబ్ల్యూ-1100 సిరీస్ ఇంజిన్లను అమర్చిన ఏ-320 నియో విమానాలను తక్షణమే కిందికి దింపేయాల్సిందిగా ఆదేశించామని డీజీసీఏ వెల్లడించింది. ఇండిగో, గో ఎయిర్ సంస్థల వద్ద ఇప్పటికీ విడిగా కొన్ని పీడబ్ల్యూ ఇంజిన్లు ఉన్నాయని, వాటిని తిరిగి అమర్చవద్దని ఆ సంస్థలకు స్పష్టం చేశామని డీజీసీఏ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రస్తుతం మొత్తం 14 ఏ-320 నియో విమానాల్లో పీడబ్ల్యూ-1100 సిరీస్ ఇంజిన్లను అమర్చారు. వీటిలో 11 విమానాలను ఇండిగో ఎయిర్‌లైన్స్, మరో 3 విమానాలను గో ఎయిర్ నడుపుతున్నాయి.

411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles