అవన్నీ అసత్య వార్తలే

Wed,March 13, 2019 01:53 AM

-నీరవ్ అప్పగింతకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం
-మీడియా ఆరోపణలను ఖండించిన ఈడీ

న్యూఢిల్లీ, మార్చి 12: నీరవ్ మోదీని భారత్‌కు రప్పించడానికి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసింది. నీరవ్ లండన్ వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలను ఇటీవల ఓ బ్రిటన్ మీడియా సంస్థ చూపించిన నేపథ్యంలో నీరవ్ అప్పగింతకు అక్కడి అధికారులు సాయం చేస్తామంటున్నా.. భారత దర్యాప్తు సంస్థలు మాత్రం స్పందించడం లేదన్న వార్తలు బ్రిటీష్ మీడియాలో గుప్పుమన్నాయి. దీనిపై ఈడీ స్పందిస్తూ అవన్నీ అసత్య వార్తలేనని కొట్టిపారేసింది. కేవలం ఊహాగానాలని, నిరాధార ఆరోపణలని రెండు పేజీల వివరణ ఇచ్చింది. ఇప్పటికే నీరవ్‌పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసులు నమోదు చేశామని, చార్జిషీట్లు దాఖలు పరిచామని, కోర్టుల నుంచి నాన్-బెయిలబుల్ వారెంట్లను జారీ చేయించుకున్నామని గుర్తుచేసింది. లండన్‌లోని వెస్ట్ ఎండ్‌లోగల తోటెన్‌హామ్ కోర్టు రోడ్డులో ఉన్న సెంటర్ పాయింట్ టవర్ అనే లగ్జరీ అపార్టుమెంట్‌లో త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్ తీసుకుని నీరవ్ ఉంటున్నట్లు గత వారం స్పష్టమైన విషయం తెలిసిందే. ఈ ఫ్లాట్ విలువ 8 మిలియన్ పౌండ్లు. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.73 కోట్లు. ఇక్కడ రూ.15.50 లక్షల నెలసరి అద్దె చెల్లించి నీరవ్ నివాసముంటున్నాడని బ్రిటన్ దినపత్రిక ది డైలీ టెలిగ్రాఫ్ ప్రకటించింది. ఓ వీడియోలో రూ.9 లక్షల విలువైన ఆస్ట్రిచ్ లెదర్ జాకెట్ వేసుకుని లండన్ వీధుల్లో నీరవ్ దర్జాగా తీరుగుతున్న దృశ్యాలూ కనిపిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను రూ.14,000 కోట్లు ముంచి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో నీరవ్ మేనమామ, రత్నాల వర్తకుడు మెహుల్ చోక్సీ కూడా ప్రధాన నిందితుడిగా ఉండగా, వీరిరువురు కుటుంబ సభ్యులతోసహా గతేడాది జనవరిలో విదేశాలకు చెక్కేశారు. వీరిద్దరిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అవగా, ఈ నెల 9న కూడా బ్రిటన్ హోం శాఖను నీరవ్ అప్పగింతకు విజ్ఞప్తి చేశామని ఈడీ స్పష్టం చేసింది.

1118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles