నీరవ్‌పై ఈడీ అనుబంధ చార్జిషీట్!

Mon,March 11, 2019 11:55 PM

-పీఎన్‌బీ స్కాం కేసులో పీఎంఎల్‌ఏ కింద నమోదు

న్యూఢిల్లీ, మార్చి 11: నీరవ్ మోదీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ తాజా చార్జిషీట్‌ను నమోదు చేసినట్లు సోమవారం ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ చార్జిషీట్‌ను లేదా విచారణ ఫిర్యాదును ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు ఎదుట కొద్దిరోజుల కిందటే దాఖలు పరిచామని సదరు వర్గాలు చెప్పాయి. కాగా, ఇది ఓ అనుబంధ చార్జిషీట్ అని, నీరవ్‌తోపాటు మరికొందరికి వ్యతిరేకంగా దీన్ని నమోదు చేశామని, ఇందులో కేసుకు సంబంధించిన అదనపు సాక్ష్యాలను, అటాచ్‌మెంట్లను పొందుపరిచామని ఈడీ అధికారులు వివరించారు. ఈ కేసులో నీరవ్ భార్య అమీ పాత్ర, ఆమె ద్వారా జరిగిన నిధుల తరలింపు విషయాలను తాజా చార్జిషీట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద అభియోగాలను మోపామన్న ఈడీ వర్గాలు.. ఇప్పటికైతే ఈ వివరాలనే చెప్పగలమని స్పష్టం చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను రూ.14,000 కోట్లు ముంచి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

ఈ కుంభకోణంలో నీరవ్ మేనమామ, రత్నాల వర్తకుడు మెహుల్ చోక్సీ కూడా ప్రధాన నిందితుడిగా ఉండగా, వీరిరువురు కుటుంబ సభ్యులతోసహా గతేడాది జనవరిలో విదేశాలకు చెక్కేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. చోక్సీ కరేబియన్ దీవుల్లో ఉన్నాడని చెబుతుండగా, నీరవ్ లండన్‌లో ఉన్నట్లు ఇటీవలే రుజువైన సంగతి విదితమే. వీరిద్దరిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అవగా, వాటి సాయంతో ఈ మామ అల్లుళ్ళను భారత్‌కు రప్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ విశ్వ ప్రయత్నాలనే చేస్తున్నది. ఇదిలావుంటే ఈ కేసులో ఇప్పటిదాకా నీరవ్‌కు చెందిన రూ.1,873.08 కోట్ల ఆస్తుల్ని పీఎంఎల్‌ఏ కింద ఈడీ జప్తు చేయగా, రూ.489.75 కోట్ల విలువైన నీరవ్, నీరవ్ కుటుంబ ఆస్తుల్నీ సీజ్ చేసింది. లండన్‌లోని వెస్ట్ ఎండ్‌లోగల తోటెన్‌హామ్ కోర్టు రోడ్డులో ఉన్న సెంటర్ పాయింట్ టవర్ అనే లగ్జరీ అపార్టుమెంట్‌లో త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్ తీసుకుని నీరవ్ ఉంటున్నట్లు శనివారం స్పష్టమైన విషయం తెలిసిందే. ఈ ఫ్లాట్ విలువ 8 మిలియన్ పౌండ్లు. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.73 కోట్లు. ఇక్కడ రూ.15.50 లక్షల నెలసరి అద్దె చెల్లించి నీరవ్ నివాసముంటున్నాడని బ్రిటన్‌కు చెందిన ది డైలీ టెలిగ్రాఫ్ ప్రకటించింది. ఓ వీడియోలో రూ.9 లక్షల విలువైన ఆస్ట్రిచ్ లెదర్ జాకెట్ వేసుకుని లండన్ వీధుల్లో నీరవ్ దర్జాగా తీరుగుతున్న దృశ్యాలూ కనిపిస్తున్నాయి.

చోక్సీ నకిలీ వజ్రాల బాగోతం


అమెరికాలోగల మెహుల్ చోక్సీ సంస్థ సామ్యూల్స్ జ్యుయెల్లర్స్ అమ్మిన వజ్రాలు చాలావరకు సహజమైనవి కావని, ఇవి రహస్య లాబొరేటరీల్లో కృత్రిమంగా రూపొందించినవని అక్కడి దివాలా కోర్టు ఫోరెన్సిక్ నివేదిక చెబుతున్నది. తప్పుడు ధ్రువపత్రాలతో సహజమైన వజ్రాలుగా వీటిని కస్టమర్లకు అమ్మినట్లు కోర్టు నియమించిన పరిశీలకుడు జాన్ జే కార్నీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఓ బ్రిటిష్ వర్జిన్ ఐస్‌లాండ్స్ సంస్థ పాత్ర ఉందన్నది. కాగా, పీఎన్‌బీ ద్వారా చోక్సీ తన గీతాంజలి జెమ్స్ సంస్థకు నకిలీ ఎల్‌వోయూలను జారీ చేసి సామ్యూల్స్ జ్యుయెల్లర్స్‌కు దాదాపు రూ.139 కోట్లను అందించారని కూడా కార్నీ చెప్పారు.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles