వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 % వృద్ధిరేటు

Tue,February 13, 2018 12:18 AM

Economy to grow over 7.5% next fiscal Goyal

-డాయిష్ బ్యాంక్ అంచనా
ముంబై, ఫిబ్రవరి 12: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు వేగవంతమై 7.5 శాతానికి చేరుకోవడం ఖాయమని జర్మన్ బ్రోకరేజి సంస్థ డాయిష్ బ్యాంక్ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణ సమస్యలు పెరుగుతున్నందున సమీప భవిష్యత్తులో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు చాలా తక్కువగా మాత్రమే ఉన్నాయని ఆ సంస్థ పేర్కొన్నది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంబంధించి ఆశావహమైన పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో 6.6 శాతంగా నమోదవుతుందని భావిస్తున్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నామని సోమవారం విడుదల చేసిన నివేదికలో డాయిష్ బ్యాంక్ వెల్లడించింది.

దేశంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) అమలు వలన తలెత్తిన ఇబ్బందుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం చివరి (2017 జూన్ నెలాఖరు) నాటికి జీడీపీ వృద్ధిరేటు మూడేండ్ల కనిష్ఠ స్థాయికి పతనమై 5.7 శాతంగా నమోదైన విషయం విదితమే. అయితే ఈ ఇబ్బందుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 6.7 శాతంగా నమోదైన జీడీపీ వృద్ధిరేటు మున్ముందు మరింత పెరిగి మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7 శాతానికి, చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 7.5 శాతానికి చేరుకునే అవకాశం ఉందని డాయిష్ బ్యాంక్ తెలిపింది.

227
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS