సులభ వాణిజ్యంలో తెలంగాణకు అగ్రస్థానం

Wed,July 11, 2018 02:27 AM

Ease of doing business rankings Andhra Pradesh tops the list Telangana slips to second

-జాతీయస్థాయిలో ప్రత్యేకత చాటిన రాష్ట్రం
-వంద శాతం సంస్కరణలు.. అమలులో మేటి
-ఈవోడీబీ తుది ర్యాంకులు ప్రకటించిన కేంద్రం
-ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సులభ వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం మరోసారి అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. ఈవోడీబీ ర్యాంకుల్లో మరోసారి వంద శాతం సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రంగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నది. దేశవ్యాప్తంగా సంస్కరణలను వంద శాతం అమలు చేసిన రెండు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి కావడం గమనార్హం. సంస్కరణల్లో 100 శాతం స్కోర్ సాధించగా.. సంస్కరణల అమలుపై ఫీడ్‌బ్యాక్‌లో 83.95 శాతం స్కోర్ లభించింది. మొత్తంగా స్కోర్ 98.33 శాతంతో తన ప్రత్యేకతను చాటుకుంది. కొత్త రాష్ట్రమైనా దేశంలో నూటికి నూరు శాతం సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాల్లో ముందు వరుసలో నిలిచింది.

ప్రపంచ బ్యాంక్, కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన ఈవోడీబీ ర్యాంకుల్లో ఈ విషయం వెల్లడైంది. రెండేండ్ల క్రితం అంటే 2016లో సులభతర వాణిజ్య విధానంలో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 2017 సంవత్సరానికి సంబంధించి మొత్తం 372 సంస్కరణలు అమలు చేయాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) విభాగం అధికారులు సూచించారు. వీటన్నింటినీ మన రాష్ట్రం పూర్తిస్థాయిలో అమలు చేయడంతో వంద శాతానికిగాను 100 శాతం స్కోర్ సాధించి రికార్డు నెలకొల్పింది. నాలుగు సంస్కరణలు తెలంగాణ రాష్ట్రానికి వర్తించవు. దీంతో వాటిని పరిగణనలోకి తీసుకోకుండా వంద శాతం స్కోర్ ఇచ్చారు డీఐపీపీ అధికారులు.

ఈవోడీబీలో 2016 సంవత్సరానికిగాను 98.78 శాతం మార్కులతో దేశంలో మొదటిస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో 2017లోనూ అగ్రభాగాన నిలువడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పకడ్బందీ కార్యాచరణ ఇందుకు దోహదం చేసింది. వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అధికారులు సంస్కరణలకు సంబంధించిన మొత్తం ఆదేశాలను అమలుపరిచారు. గత సంవత్సరం కేవలం సంస్కరణల అమలును మాత్రమే పరిగణనలోకి తీసుకోగా, ఈసారి మాత్రం లబ్ధి పొందినవారి నుంచి అభిప్రాయాలనూ తీసుకున్నారు. వీరి అభిప్రాయాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల నుంచి డీఐపీపీ అధికారులు సేకరించారు. ఈవోడీబీలో సూచించిన సంస్కరణలు కేవలం కాగితాలకు పరిమితం కాకూడదనే ఉద్దేశంతో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు సేకరించనున్న నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవగాహన శిబిరాలను ఏర్పాటు చేశారు. టీఎస్‌ఐపాస్‌తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తుండటంతో పారిశ్రామికవేత్తలకు సౌలభ్యంగా ఉండేలా ఈవోడీబీ సంస్కరణలు అమలు చేస్తున్నారు.

95 శాతం స్కోర్‌తో తొమ్మిది రాష్ర్టాలు

సులభతర వాణిజ్య విధానంలో ర్యాంకులు దక్కించుకున్న మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ర్టాలు ఉండటం విశేషం. 98.42 స్కోరుతో ఆంధ్రపద్రేశ్ మొదటి స్థానంలో ఉన్నది. 95 శాతానికిపైగా స్కోర్ సాధించిన రాష్ర్టాలను టాప్ ఆచీవర్స్‌గా గ్రేడ్‌లు ఇచ్చారు. 90-95 శాతం స్కోర్ సాధించిన రాష్ర్టాలకు ఆచీవర్స్‌గా గ్రేడివ్వగా, వీటిలో ఆరు రాష్ర్టాలున్నాయి. ఫాస్ట్ మూవర్స్‌గా 80-90 శాతం స్కోర్ సాధిం చిన రాష్ర్టాల్లో మూడు, ఆస్పైర్స్‌గా 80 శాతం కంటే తక్కువ స్కోర్ సాధించిన వాటిలో 18 రాష్ర్టాలున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ర్టాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Mnister

సత్ఫలితాలిచ్చిన కేటీఆర్ కృషి...

2016లో మొదటి ర్యాంకు సాధించిన రాష్ట్రం 2017లోనూ అగ్రస్థానంలో నిలువడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు దోహదపడ్డాయి. మొదటి ర్యాంకును నిలబెట్టుకోవాలని, అందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని 2016 ర్యాంకుల ప్రకటన సమయంలోనే కేటీఆర్ ప్రకటించారు. అదే స్ఫూర్తితో ర్యాంకు ల్లో రాష్ట్రం అగ్రభాగాన నిలిచేందుకు అధికారులు తీవ్రంగా కృషిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించి శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతీ శాఖలో ఒక నోడల్ అధికారిని ఈవోడీబీ అంశాలకు ప్రత్యేకంగా నియమించారు. ఆయా శాఖల సంస్కరణల అమలుతీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పరిశ్రమల శాఖ అధికారులతో అన్ని శాఖలను సమన్వయపరిచారు. డీఐపీపీ అధికారుల వీడియో కాన్ఫరెన్స్, ఢిల్లీ స్థాయిలో సమీక్షా సమావేశాలకు ఎప్పటికప్పుడు హాజరవుతూ ఈవోడీబీ సంస్కరణలకు రాష్ట్రం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేశారు. కేంద్ర అధికారుల సమీక్షల్లోనూ రాష్ట్రం అమలుచేస్తున్న సంస్కరణలకు ప్రశంసలు లభించాయి.

టీఎస్‌ఐపాస్‌తో అద్భుతం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంపై అనేక అపోహలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా టీఎస్‌ఐపాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పారిశ్రామికవేత్తలు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కీలక నిర్ణయం ఈవోడీబీలో మెరుగైన ర్యాంకు సాధించడంలో ముఖ్యపాత్ర పోషించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. అధికారుల విభజనలో ఆలస్యమైనా.. అందుబాటు లో ఉన్న అధికారులు, సిబ్బందితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ ఏర్పడేనాటికే పారిశ్రామికంగా ముందంజలో ఉన్న రాష్ట్రాలను సైతం దీటుగా ఎదుర్కొన్ని రెండో ర్యాంకు సాధించింది.
EODB

104 ఆన్‌లైన్ సర్వీసులు.. మరెన్నో...

2017కు సంబంధించి మొత్తం 372 సంస్కరణలను రూపొందించారు. ఇందులో నాలుగు రాష్ట్రానికి వర్తించవు. మిగిలిన 368ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసి రికార్డు నెలకొల్పింది. సంస్కరణల అమల్లో వందకు వందశాతం స్కోర్‌తో దేశంలోనే ముందువరుసలో నిలిచింది. 2017కుగాను డీఐపీపీ రూపొందించిన సంస్కరణల్లో 16 సచివాలయ శాఖలు, 27 హెచ్‌వోడీలు ఉన్నాయి. ఈవోడీబీ సంస్కరణల్లో భాగంగా 104 సర్వీసులను కొత్తగా ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 57 కొత్త చట్టాల రూపకల్పన, ప్రస్తుతమున్న చట్టాల సవరణ, జీవోలు, సర్క్యులర్లను జారీచేశారు. 2017లో డీఐపీపీ అధికారులు కేవలం సంస్కరణలను తీసుకురావడమే కాకుండా వాటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధిపొందినవారి అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వాలు రూపొందించిన సంస్కరణలు క్షేత్రస్థాయిలో వారికి ఎంతవరకు ఉపయోగపడ్డాయనేది స్వయంగా వారినుంచి సమాచారాన్ని సేకరించారు. 372 సంస్కరణల్లో 2016, 2017లో ఒకేరకమైన ప్రశ్నల్లో 78ని వాటిని ఎంపిక చేశారు.

1068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS