మలేషియా పామాయిల్ కొనొద్దు

Wed,October 23, 2019 05:07 AM

-సభ్యులకు ఎస్‌ఈఏఐ వాణిజ్య సంఘం ఆదేశం
-కశ్మీర్ అంశంపై విమర్శలే కారణం

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: మలేషియా నుంచి పామాయిల్ కొనుగోళ్లను ఆపేయాలని తమ వర్తక సభ్యులను ఎస్‌ఈఏఐ వాణిజ్య సంఘం ఆదేశించింది. కశ్మీర్‌పై భారత్ వైఖరిని మలేషియా విమర్శించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఈఏఐ అధ్యక్షుడు అతుల్ చతుర్వేదీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత మలేషియానే పామాయిల్‌ను అధికంగా ఉత్పత్తి, ఎగుమతి చేస్తున్నది. మలేషియా నుంచి పామాయిల్, పామ్ ఆధారిత ఉత్పత్తులను భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నది.

గతేడాది మలేషియా పామాయిల్ ఎగుమతుల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 1.63 బిలియన్ డాలర్ల కొనుగోళ్లను చేసింది. మలేషియా జీడీపీలో వెజిటబుల్ ఆయిల్ వాటానే 2.8 శాతంగా ఉన్నది. మొత్తం ఎగుమతుల్లో 4.5 శాతానికి సమానం. దీంతో తాజా నిర్ణయం మలేషియాపై బాగానే ప్రభావం చూపుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కాగా, భారత్‌కు మలేషియా మొత్తం ఎగుమతులు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో 10.8 బిలియన్ డాలర్లుగా నమోదైయ్యాయి. భారత్ నుంచి దిగుమతులు 6.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. మలేషియా సరఫరాలు ఆగితే.. భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయని, దేశంలో పామాయిల్ కొరత ఉండబోదని ఎస్‌ఈఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహెతా అన్నారు.

వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోను

కశ్మీర్ అంశంపై భారత్ తీరుపట్ల తాను చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోబోనని మలేషియా ప్రధాన మంత్రి మహతీర్ తేల్చిచెప్పారు. మలేషియా పామాయిల్ కొనుగోళ్లను నిషేధిస్తూ ఎస్‌ఈఏఐ తీసుకున్న నిర్ణయం ప్రభావాన్ని సమీక్షిస్తామన్నారు. ఈ సమస్యను తగువిధంగా పరిష్కరించుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు ఫ్యూచర్స్ ట్రేడింగ్ మార్కెట్‌లో మంగళవారం మలేషియా పామాయిల్ ఫ్యూచర్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. ఎస్‌ఈఏఐ ప్రకటన ప్రభావం స్పష్టంగా కనిపించిందని ట్రేడింగ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

1238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles