గణాంకాల్లో జోక్యం వద్దు

Fri,March 15, 2019 12:24 AM

Do not interfere with statistics

రాజకీయ పార్టీల తీరుపై ఆర్థిక, సామాజికవేత్తల్లో ఆందోళన
న్యూఢిల్లీ, మార్చి 14: జాతీయ గణాంకాలను రాజకీయ పార్టీలు ప్రభావితం చేయాలని చూస్తున్నాయని దేశ, విదేశీ ఆర్థిక, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఆర్థిక, సామాజిక గణాంకాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతున్నదని 108 మంది ఆర్థికవేత్తలు, సామాజిక నిపుణులు మూకుమ్మడిగా తమ నిరసనను వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) ఉద్యోగ వివరాల మార్పుపై వివాదం నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్తలు స్పందించారు. దశాబ్దాలుగా భారత గణాంక వ్యవస్థకు గొప్ప గౌరవం ఉందని, ఆర్థిక, సామాజిక అంశాలపై అంచనాలపట్ల విశ్వాసం ఉన్నదన్న వీరంతా.. ఇటీవలికాలంలో తమ అంచనాలపై తరచూ వస్తున్న వివాదాలు, నాణ్యతపై వస్తున్న విమర్శల్ని ఖండించారు.

తమ అంచనాల్ని, నిర్ణయాల్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభావితం చేయబోవన్న వారంతా ఇలాంటి చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే సంస్థాగత స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు, ప్రజా గణాంకాల సమగ్రతను నిలుపుకునేందుకు ఆర్థిక, గణాంక నిపుణులు, స్వతంత్ర పరిశోధకులందరు కలిసికట్టుగా ముందుకు రావాలని గురువారం పిలుపునిచ్చారు. విజ్ఞాపన పత్రంపై దేశ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు, స్వతంత్ర సంస్థల నిపుణులు సంతకాలు చేశారు.

ఆందోళనల్ని గుర్తించాలి: మోహనన్

108 మంది ఆర్థివేత్తలు, సామాజిక నిపుణులు వెలిబుచ్చిన ఆందోళనల్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలని జాతీయ గణాంక సంఘం మాజీ చీఫ్ పీసీ మోహనన్ హితవుపలికారు. ఎన్‌ఎస్‌వో చీఫ్‌గా ఇటీవలే మోహనన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక గణాంకాలపై అనవసరపు విమర్శలు వద్దని, అంచనాల్లో ప్రభుత్వాలు, ప్రతిపక్షాల జోక్యం తగదన్నారు.

219
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles