జోరుగా దీపావళి అమ్మకాలు

Fri,November 9, 2018 12:47 AM

Diwali sales spike 20 percent to Rs 30000 crore

-గతంతో పోల్చితే 20 శాతం వృద్ధి
-దేశవ్యాప్తంగా రూ.30,000 కోట్లుగా నమోదు
-కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు గిరాకీ

ముంబై, నవంబర్ 8: దీపావళి సందర్భంగా ఈసారి అమ్మకాలు గతంతో పోల్చితే 20 శాతం పెరిగాయని జాతీయ వర్తక, వాణిజ్య సంఘం సీఏఐటీ తెలిపింది. దేశవ్యాప్తంగా పండుగ విక్రయాలు రూ.30,000 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. గతేడాది రూ.25,000 కోట్లుగానే ఉన్నట్లు పేర్కొన్న సీఏఐటీ.. గడిచిన నాలుగేండ్లుగా మందగమనంలోనే ఉన్న సెంటిమెంట్ ఈ దఫా పుంజుకున్నదని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ తదితర కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అలంకరణ సామాగ్రితోపాటు బహుమతుల వస్తువుల వంటి ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు గిరాకీ బాగుందని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ గురువారం ఓ ప్రకటనలో వివరించారు. రెడీమేడ్ దుస్తులు, డ్రై ఫ్రూట్స్, కారపు తినుబండారాలు, స్వీట్స్, బిస్కట్లు ఇతరత్రా మిఠాయిల అమ్మకాలూ ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. కంప్యూటర్లు, కంప్యూటర్ ఆధారిత ఉత్పత్తులు, రంగులు, హార్డ్‌వేర్, వంటింటి ఉపకరణాలకూ పెద్ద ఎత్తున డిమాండ్ కనిపించిందని వెల్లడించారు. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలోనే ఈసారి రూ.5,000 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని ఖండేల్వాల్ స్పష్టం చేశారు.

ప్రతికూలతలు లేకుంటే..

అధిక ధరలు, రుణాలపై ఆంక్షలు, ఆన్‌లైన్ షాపింగ్ వంటి ప్రతికూలతలు లేకుంటే ఈసారి అమ్మకాలు మరింత బాగుండేవని సంప్రదాయ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంతో పెట్టుబడులు కరువయ్యాయన్న సదరు మార్కెటీర్లు.. స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు తదితర హైఎండ్ ఉత్పత్తుల అమ్మకాలకు ఫైనాన్స్ సదుపాయం సన్నగిల్లిందని, ఇది అమ్మకాలను ప్రభావితం చేసిందన్నారు. ఆటో రంగానికీ ప్రస్తుత పరిణామాలు ఇబ్బందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నీరసించిన పటాకుల ఉత్సాహం

దీపావళికి మిగతా రంగాల అమ్మకాలు ఎలా ఉన్నా.. ప్రధానమైన పటాకుల విక్రయాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. పెచ్చుమీరిన కాలుష్యం, సుప్రీం కోర్టు మార్గదర్శకాల మధ్య ఈసారి క్రాకర్ సేల్స్ 40 శాతం పడిపోయి ఉండవచ్చని ఖండేల్వాల్ అంచనా వేశారు. ఏటా పటాకుల మార్కెట్ రూ.20,000 కోట్ల వృద్ధిని చూస్తున్నదని, కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితులు లేవన్నారు. సుప్రీం తీర్పుతో ఒక్క ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోనే పటాకుల మార్కెట్‌కు రూ.500 కోట్ల ఆదాయం తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. చైనా క్రాకర్స్‌తో దేశీయ ఉత్పత్తిదారులకు పెద్ద దెబ్బేనన్న ఆయన ఈ ఏడాదీ రూ.4,000 కోట్ల చైనా పటాకులు భారత్‌లోకి వచ్చాయని చెప్పారు.

769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS