ఆరు నెలల గరిష్ఠానికి టోకు


Wed,November 15, 2017 12:21 AM

-అక్టోబర్‌లో 3.59 శాతంగా నమోదు
-భగ్గుమన్న ఉల్లి, కూరగాయలు
inflation
న్యూఢిల్లీ, నవంబర్ 14: గడిచిన కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన కూరగాయల ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకోగా..తాజాగా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కూడా ఆరు నెలల గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ నెలకుగాను టోకు ధరల సూచీ 3.59 శాతంగా నమోదైందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఉల్లి, కూరగాయల ధరలు భారీగా పెరుగడం ఇందుకు కారణమని విశ్లేషించింది. సెప్టెంబర్‌లో ధరల సూచీ 2.60 శాతంగా ఉండగా, అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 1.27 శాతంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్‌లో నమోదైన 3.85 శాతం ఇప్పటి వరకు ఇదే గరిష్ఠ స్థాయి. ఆహార పదార్థాలకు సంబంధించిన గణాంకాలు రెండింతలు పెరిగి 4.30 శాతంగా నమోదైంది.

గడిచిన నెలలో కూరగాయల ధరలు 36.61 శాతానికి పెరుగగా, ఉల్లి సూచీ 127.04 శాతంగాను, వీటితోపాటు కోడిగుడ్లు, మాంసం, చేపల ధరలు కూడా 5.76 శాతం చొప్పున అధికమయ్యాయి. కానీ తయారీ రంగ సూచీ 2.72 శాతం నుంచి 2.62 శాతానికి తగ్గింది. చమురు, ఇంధన ధరల సూచీ 9.01 శాతం నుంచి 10.52 శాతానికి ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇంధన ధరల సూచీ ఎగువముఖం పట్టిందని పేర్కొంది. అయినప్పటికీ పప్పుదినుసుల ధరల సూచీ మాత్రం 31.05 శాతానికి తగ్గడం కొంతలో కొంత ఊరటనిచ్చే విషయం. బంగాళాదుంప ధరలు 44.29 శాతంగా నమోదవగా, గోధుమలు 1.99 శాతంగా ఉన్నాయి. ఆగస్టు నెలకుగాను విడుదలైన టోకు ధరల సూచీ 3.24 శాతంలో ఎలాంటి మార్పులు నమోదు కాలేదు. కాగా, రిటైల్, టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణ గణాంకాలు ఎగువముఖం పట్టడంతో వచ్చే పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 6న తదుపరి సమీక్షను ఆర్బీఐ ప్రకటించనున్నది.

101

More News

VIRAL NEWS