ఉద్యోగ కల్పనలో జోష్

Mon,March 11, 2019 11:50 PM

Demand for software professionals

-ఫిబ్రవరిలో 16 శాతం వృద్ధి
-సాఫ్ట్‌వేర్ నిపుణులకు భలే డిమాండ్: నౌకరీ.కామ్ వెల్లడి

ముంబై, మార్చి 11: ఉద్యోగ అవకాశాలు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో ఉద్యోగ కల్పనలో 16 శాతం వృద్ధి నమోదైందని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో అవకాశాలు జోరుమీదుండటం వల్లనే కల్పనలో రెండంకెల వృద్ధి నమోదైందని తెలిపింది. ఈ రెండు రంగాల్లో వృద్ధి 38 శాతంగా ఉన్నదని తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన వృద్ధితో పోలిస్తే 16 శాతం పెరిగిందని, జనవరి నెలలో కూడా 15 శాతం ఉన్నదని పేర్కొంది. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉన్న 3,300 ఉద్యోగ నియామకదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. వీరిలో 84 శాతం రిక్యూటర్లు నూతన ఉద్యోగాలను సృష్టించినట్లు ఇన్ఫోఎడ్జ్ ఇండియా సీఎంవో సుమీత్ సింగ్ తెలిపారు. మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాలు భారీ స్థాయిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాయని, గడిచిన నెలలో కూడా 38 శాతం పెరుగుదల నమోదైందని పేర్కొంది. దీంతోపాటు నిర్మాణ, ఇంజినీరింగ్ ఇండస్ట్రీలో కూడా 16 శాతం పెరుగుదల నమోదైంది. అలాగే మానవ వనరుల విభాగంలో కూడా 20 శాతం ఎగబాకాయి. సర్వేలోని పలు ముఖ్య అంశాలు..
-4-7 ఏండ్ల అనుభవం కలిగిన ఉద్యోగులకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. ఈ విభాగంలో 18 శాతం వృద్ధి నమోదైంది.
-చెన్నై, ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగ అవకాశాల్లో అత్యధిక వృద్ధి నమోదైంది. ఈ రెండు నగరాల్లో 30 శాతం వరకు పెరిగాయి.
-చెన్నైలో ఆటో/ఆటోమొబైల్ విభాగంలో 26 శాతం పెరుగగా, బీపీవోలో 13 శాతం, ఐటీ-సాఫ్ట్‌వేర్‌లో 38 శాతం, ఐటీఈఎస్‌లో 8 శాతం వృద్ధి నమోదైంది. కానీ ఎఫ్‌ఎంసీజీలో 14 శాతం తగ్గాయి.
-మిగతా నగరాలతో పోలిస్తే ముంబైలో ఎఫ్‌ఎంసీజీ రంగం ఉద్యోగ కల్పన జోరందుకున్నది. ఈ రంగంలో 28 శాతం పెరుగగా, ఐటీ-సాఫ్ట్‌వేర్‌లో 32 శాతం, ఆటో 80 శాతం ఎగబాకాయి. కానీ అకౌంటింగ్‌లో 12 శాతం పతనం చెందాయి.

997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles