హైపర్‌స్కేల్ డాటా సెంటర్

Wed,December 26, 2018 01:51 AM

CtrlS To Invest Rs 2000 Crore To Set Up Worlds Largest Tier 4 Datacentre

-హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కంట్రోల్‌ఎస్
-150 మెగావాట్ల సామర్థ్యం: సంస్థ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి
-2020 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద టైర్-4 డాటా సెంటర్ వ్యవస్థ
-రూ.2,000 కోట్ల పెట్టుబడితో ప్రణాళిక

హైదరాబాద్, డిసెంబర్ 25: హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ కంట్రోల్‌ఎస్.. 2020 నాటికి దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద టైర్-4 డాటా సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఈ డాటా సెంటర్ కోసం రూ. 2,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నది. ఇక హైదరాబాద్‌లో 150 మెగావాట్ల హైపర్‌స్కేల్ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తుండగా, ఇదే తరహాలో ముంబైలోనూ 100 మెగావాట్లది, చెన్నైలో మరో 70 మెగావాట్ల హైపర్‌స్కేల్ డాటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కంట్రోల్‌ఎస్ డాటా సెంటర్స్ వ్యవస్థాపక సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి పీటీఐకి తెలిపారు. దేశంలో డాటా నిల్వకు డిమాండ్ పెరిగింది. డాటా స్థానికీకరణ కూడా భారత్‌లో హైపర్‌స్కేల్ డాటా సెంటర్‌లకు ఊతమిస్తున్నది. వచ్చే ఏడాది మార్చి నుంచి ముంబైలో కొత్త టైర్-4 డాటా సెంటర్ నిర్మాణాన్ని మేము ప్రారంభిస్తున్నాం.

హైదరాబాద్ కేంద్రాన్ని మే-జూన్ నెలల్లో, అక్టోబర్-డిసెంబర్లో చెన్నై సెంటర్‌ను ప్రారంభిస్తాం. వీటన్నిటి కోసం దాదాపు రూ.2,000 కోట్ల పెట్టుబడులను పెడుతున్నాం అని పిన్నపురెడ్డి చెప్పారు. 2020కల్లా అన్ని డాటా సెంటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా, తమ విస్తరణ ప్రణాళికకు అవసరమైన పెట్టుబడుల్లో చాలావరకు అంతర్గత వనరుల నుంచే సేకరిస్తున్నామన్న ఆయన కొంతమేర రుణ నిధులతో సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. అదనంగా దాదాపు 40 లక్షల చదరపు అడుగుల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవడం వల్ల టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఓ ప్రపంచ శ్రేణి డాటా సెంటర్ వ్యవస్థగా కంట్రోల్‌ఎస్ ఆవిర్భవించనున్నది అని పిన్నపురెడ్డి అన్నారు.

గడిచిన 1,000 రోజుల్లోనే ప్రపంచంలో 90 శాతం డాటా ఉత్పత్తి అయ్యిందన్న ఆయన భారతీయ డాటా వివరాలను స్థానికంగానే భద్రపరుచాలన్న నిబంధనలు డాటా సెంటర్ల విస్తరణకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి విదేశీ సంస్థలు రావడం కూడా భారత్‌లో డాటా సెంటర్ల ఏర్పాటును పరుగులు పెట్టిస్తున్నదని పేర్కొన్నారు. కంట్రోల్‌ఎస్‌కు ఇప్పటికే లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో డాటా సెంటర్లుండగా, హైదరాబాద్, ముంబైల్లో టైర్-4 కేంద్రాలు రెండేసి చొప్పున ఉన్నాయి. నోయిడాలో మరొకటి ఉండగా, చెన్నైలో టైర్-3 డాటా సెంటర్ ఉన్నది.

ఇకపోతే ఫార్చూన్ 100 గ్లోబల్ బహుళజాతి సంస్థల్లో 20 కంపెనీలకు కంట్రోల్‌ఎస్ సేవలను అందిస్తున్నదని సంస్థ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షుడు బీఎస్ రావు తెలిపారు. గ్లోబల్ డాటా సెంటర్ మార్కెట్‌ను 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అమెరికా 40 శాతం ఆక్రమించగా, 54 బిలియన్ డాలర్లతో ఐరోపా, రష్యా కలిసి 32 శాతం గుప్పిట్లో పెట్టుకున్నట్లు కుష్మన్-వేక్‌ఫీల్డ్ రిపోర్టు చెబుతున్నది. ప్రస్తుతం భారత్ వాటా 4.5 బిలియన్ డాలర్లుగా ఉందని, 2020 నాటికి 7 బిలియన్ డాలర్లకు వెళ్లగలదని వెల్లడించింది. భారత్‌లో 350 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు, 258 మిలియన్ల సోషల్ మీడియా వినియోగదారులు, 224 మిలియన్ల డిజిటల్ కొనుగోలుదారులున్నట్లు అంచనా. ఆసియా-పసిఫిక్ ప్రాంతం 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 25 శాతం వాటాను కలిగి ఉందని సదరు నివేదిక తెలిపింది.

1127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles