అయోమయంలో వెయ్యి కోట్లు

Thu,February 7, 2019 12:49 AM

crypto exchange may have lost 145 million dollars after its CEO suddenly died

-కెనడా క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ సీఈవో ఆకస్మిక మరణం
-వేల ఖాతాలకు తెలియని పాస్‌వర్డులు
-ఎవరికీ అందని 145 మిలియన్ డాలర్ల ఆస్తులు
-కెనడా క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ సీఈవో ఆకస్మిక మరణం

టోరంటో/న్యూయార్క్, ఫిబ్రవరి 6: ఓ మరణం.. ఓ అగ్రస్థాయి క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ మూతబడ్డానికి కారణమవుతున్నది. వేలాది మంది కస్టమర్ల ఆశల్ని ఆవిరి చేస్తున్నది. వందల కోట్ల రూపాయలను అయోమయంలో పడేస్తున్నది. అవును.. కెనడాకు చెందిన క్వాడ్రిగాసీఎక్స్ సంస్థ ఇప్పుడు దివాలా అంచున నిలబడింది. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు, దాని సీఈవో కూడా అయిన గెరాల్డ్ కాటెన్ గతేడాది డిసెంబర్ 9న మృతిచెందాడు. 30 ఏండ్ల గెరాల్డ్.. భారత్ పర్యటనలో ఉన్నప్పుడు జైపూర్‌లో చనిపోయాడు. ఓ బాలల అనాథాశ్రమం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్వాడ్రిగా, గెరాల్డ్ భార్య జెన్నిఫర్ రాబర్ట్‌సన్ తెలిపిన వివరాల ప్రకారం క్రోన్ వ్యాధితో గెరాల్డ్ బాధపడుతున్నాడు. కాగా, గెరాల్డ్ ఆకస్మిక మరణంతో క్రిప్టోకరెన్సీ లావాదేవీలను నిర్వర్తిస్తున్న క్వాడ్రిగా పరిస్థితి అంధకారమైందిప్పుడు. కెనడాలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌ల్లో క్వాడ్రిగా ఒకటి. ఇందులో 145 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1,050 కోట్లు) బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ ఆస్తులున్నాయి. కోల్డ్ వాలెట్లు అనే ఆఫ్‌లైన్ అకౌంట్లలో ఈ క్రిప్టోకరెన్సీని క్వాడ్రిగా భద్రపరిచింది. ఈ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు గెరాల్డ్‌కు మాత్రమే తెలుసు. గెరాల్డ్ చనిపోవడంతో ఇప్పుడు ఆ కరెన్సీ ఎవరికీ అందకుండాపోతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు.

bitcon2

నిపుణుల నిస్సహాయత

హ్యాకర్ల నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కోల్డ్ వాలెట్లలో క్రిప్టోకరెన్సీని క్వాడ్రిగా భద్రపరుచగా, గెరాల్డ్ మరణంతో పాస్‌వర్డులున్న ఈ వాలెట్లు తెరుచుకోవడం అసాధ్యంగా మారింది. నిపుణులు సైతం ఈ పాస్‌వర్డ్‌లను కనిపెట్టలేకపోతున్నారు. సంస్థ నియమించిన టెక్నాలజీ నిపుణులు.. కంప్యూటర్లు, ముఖ్యంగా గెరాల్డ్ వినియోగించే వ్యక్తిగత ల్యాప్‌టాప్‌ను తెరిపించడానికి తీవ్రంగానే శ్రమించారు. అయినప్పటికీ ఫలితం శూన్యం. దీంతో క్లయింట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లక్షకుపైగా ఖాతాదారులకు వెయ్యి కోట్ల రూపాయల మేర క్వాడ్రిగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నదని, ఎలా చెల్లించాలో తెలియని సందిగ్ధంలో ఉందని సీఎన్‌ఎన్ వెల్లడించింది. అయితే గెరాల్డ్ మొబైల్‌ఫోన్ నుంచి కొంత సమాచారం రాబట్టినట్లు తెలుస్తున్నది.

దివాలా రక్షణ

వేలాది మందికి వందల కోట్లను ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో చేసేదేమీలేక క్వాడ్రిగా.. బ్రిటిష్ కొలంబియాలోని నోవా స్కాటియా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో దివాలా రక్షణ లభించింది. క్రెడిటార్ ప్రొటెక్షన్‌ను మంజూరు చేసినట్లు మంగళవారం క్వాడ్రిగా తెలిపింది. కోల్డ్ వాలెట్లలోకి వెళ్లేందుకు కావాల్సిన పాస్‌వర్డులు గెరాల్డ్‌కు మాత్రమే తెలిసినందున, తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనందున బ్యాంక్ప్స్రీ ప్రొటెక్షన్‌ను తీసుకున్నట్లు సంస్థ చెప్పింది.

ఎంత వెతికినా దొరకట్లేదు

మరోవైపు సోషల్ మీడియాలో తన భర్త మృతిపై అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, గెరాల్డ్ నిజంగానే చనిపోయాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని జెన్నిఫర్ రాబర్ట్‌సన్ తెలిపినట్లు ఓ ప్రకటనలో క్వాడ్రిగా వెల్లడించింది. తనకు బెదిరింపులు కూడా వస్తున్నట్లు ఆమె చెప్పారని క్వాడ్రిగా ఈ సందర్భంగా సదరు ప్రకటనలో పేర్కొన్నది. గతకొద్ది వారాలుగా గెరాల్డ్ మరణంతో ఏర్పడిన తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని, అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఏవీ సఫలం కావడం లేదన్నది. రాబర్ట్‌సన్ సైతం ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకడం లేదంటున్నది. ఎక్కడైనా ఈ పాస్‌వర్డ్‌ల సమాచారం రాసి ఉంటారా? అన్న కోణంలోనూ అన్నిచోట్లా వెతికామని ఆమె చెబుతున్నది.

2594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles